సేవతోనే మానవ జన్మసార్థకం
కొమ్మాది: సేవతోనే మనిషి జన్మకు సార్థకత చేకూరుతుందని.. అలాంటిది ఎన్నో సేవలు చేసిన లయన్స్ ఇంటర్నేషనల్ సేవలు ఎంతో గొప్పవని కేంద్ర ఉక్కు సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. సోమవారం సాగర్‌నగర్‌లో గల రాడిసన్‌బ్లూలో లయన్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఫోర్బ్స్ వి సర్వ్ ఇండియా సీజన్–2 పశ్చిమ, దక్షిణ జోన్ల అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 550 మంది కాళ్లు లేని వారికి కృత్రిమ కాళ్లను లయన్స్ ఇంటర్నేషనల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సామాజిక సేవలో లయన్స్ ఇంటర్నేషనల్ ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు. శక్తికి మించిన సేవలు అందిస్తుందని కొనియాడారు. లయన్స్ క్లబ్‌కు కేంద్ర ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు అందించనున్నట్లు తెలిపారు. తాను మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి నని, ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరి ఈ దేశానికి మంచి జరుగుతుందనే నమ్మకంతో రాజకీయంలోకి వచ్చానని తెలిపారు. అనంతరం విద్య, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారిత, పర్యావరణం, హెల్త్‌కేర్ రంగాలకు చెందిన విజేతలకు అవార్డులను ఆయన ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ సుభాష్‌బాబు, విఘ్నేష్ విజయ్‌రాజు తదితరులు పాల్గొన్నారు.


