గూగుల్ డేటాకు భూ కేటాయింపులు రద్దు చేయాలి
మహారాణిపేట: గూగుల్ డేటా సెంటర్‌కు 480 ఎకరాల భూమి కేటాయింపును సీపీఐ వ్యతిరేకించింది. ఈ మేరకు సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి పాత్రపల్లి చంద్రశేఖర్ సోమవారం కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. డేటా సెంటర్ల ఏర్పాటుతో పర్యావరణం దెబ్బతిని, నీరు, విద్యుత్ కొరత ఏర్పడుతుందని, అందువల్ల ప్రభుత్వం పునరాలోచించాలని ఆయన కోరారు. గతంలో ఖాళీగా ఉన్న 400 ఎకరాలను ఈ సంస్థకు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే పెదగంట్యాడ ఏరియాలో ఏర్పాటు చేయనున్న అదాని అంబుజా సిమెంట్ గ్రేడింగ్ ఫ్యాక్టరీ ప్రతిపాదనను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఫ్యాక్టరీ వల్ల ప్రాణాంతక వ్యాధులు వస్తాయని, ప్రజలు ప్రజాభిప్రాయ సేకరణలో దీనిని అడ్డుకున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో సీపీఐ గాజువాక నియోజకవర్గం కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ ,పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.మన్మథరావు, ఆర్ శ్రీనివాసరావు, ఎండి బేగం, ఎన్. నాగభూషణరావు. వనజాక్షి తదితరులు పాల్గొన్నారు.


