వందేభారత్ రైళ్ల గందరగోళం
తాటిచెట్లపాలెం: వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ఆలస్యం, గందరగోళం ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించింది. వేగంగా, సౌకర్యవంతంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆశించే ప్రయాణికులు ప్రస్తుతం రైళ్ల ఆలస్యం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ నుంచి సోమవారం ఉదయం బయల్దేరాల్సిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ తీవ్ర ఆలస్యంగా, మధ్యాహ్నం 2 గంటల తర్వాత బయల్దేరింది. అదే సమయంలో సికింద్రాబాద్ నుంచి వచ్చి, సికింద్రాబాద్‌కు తిరిగి వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కూడా స్టేషన్‌కు చేరుకోవడంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు ఒకేసారి ప్లాట్‌ఫాం నంబర్ 1 , 8 లపై ఉండడం వల్ల, ఉదయం బయల్దేరవలసిన రైలు ఏది, మధ్యాహ్నం బయల్దేరవలసిన రైలు ఏదో తెలియక ప్రయాణికులు తీవ్ర అయోమయానికి గురయ్యారు. ఆలస్యం గురించి సమాచారం ఉన్నప్పటికీ, రెండు రైళ్లు దాదాపు ఒకే సమయంలో బయల్దేరడంతో ప్రయాణికులు తికమకపడ్డారు. కొందరు ప్రయాణికులు ఉదయం వెళ్లాల్సిన రైలుకు బదులుగా మధ్యాహ్నం వెళ్లాల్సిన రైలు ఎక్కారు. తర్వాత పొరపాటు తెలుసుకుని పరుగు పరుగున 8వ నంబర్ ప్లాట్‌ఫాంకు చేరుకుని, రీ–షెడ్యూల్ చేసిన ఉదయం బయల్దేరవలసిన రైలు ఎక్కవలసి వచ్చింది. ముఖ్యంగా విశాఖ–సికింద్రాబాద్–విశాఖపట్నం (20833/20834) వందేభారత్ ఎక్స్‌ప్రెస్ తరచుగా ఆలస్యంగా నడవడంపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల ఇబ్బందులను నివారించడానికి, రైల్వే అధికారులు జోక్యం చేసుకుని, అవసరమైతే ఒక రోజు రైలును రద్దు చేసి అయినా సరే, మిగిలిన రోజులలో సరైన సమయానికి రైలు బయల్దేరేలా చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.


