ఐటీడీపీ సోషల్ మీడియా కనుసన్నల్లోనే పోలీసుల విధులు
డ్రగ్స్ కేసులో పట్టుబడిన మరో ఇద్దరి పేర్లు ఎందుకు బయట పెట్టడం లేదు
వైఎస్సార్ సీపీకి చెందిన కొండారెడ్డినే ఐటీడీపీ ద్వారా ప్రచారం చేయిస్తున్నారు
తప్పు చేసిన వారికి వైఎస్సార్ సీపీ ఎప్పుడూ మద్దతు ఇవ్వదు
సాక్షితో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర వ్యాప్తంగా ఐటీడీపీ సోషల్ మీడియా కనుసన్నల్లోనే పోలీసులు విధులు నిర్వహిస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ పోలీసులు, ఐటీడీపీ కలిసి వైఎస్సార్‌సీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం మధ్యాహ్నం దురంతో ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక ప్రయాణికుడి వద్ద పట్టుబడ్డ డ్రగ్స్‌ను ఈగల్ టీమ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, ఈ కేసులో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకుడు కొండారెడ్డి ఉన్నాడంటూ ఐటీడీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయించిందని ఆయన ఆరోపించారు.
టీడీపీ నేత పేరు ఎందుకు దాచారు?
ఈ కేసులో పోలీసులు ప్రాథమిక సమాచారం ప్రకారం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోందని, వారిలో శ్రీకాకుళం జిల్లా టీడీపీ నాయకుడు మురళీధర్ రావు కుమారుడు సంగి హర్షవర్ధన్ నాయుడు, అలాగే మాడా చరణ్ అనే వ్యక్తులు ఉన్నారని కేకే రాజు పేర్కొన్నారు. అయితే టీడీపీ నాయకుడి కుమారుడు, మరో వ్యక్తి పేర్లను పోలీసులు ఎందుకు బయటపెట్టలేదని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో కేవలం వైఎస్సార్‌సీపీ జిల్లా విద్యార్థి విభాగం నాయకుడు కొండారెడ్డి ఉన్నట్లుగానే పోలీసులు ఐటీడీపీకి సమాచారం ఇచ్చి ప్రచారం చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు.
చట్టం ప్రకారమే చర్యలు తీసుకోవాలి
చట్టాలకు ఎవరూ చుట్టాలు కాదు. వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్‌కు పాల్పడేవారికి మద్దతివ్వదు. నిజంగా మాదకద్రవ్యాల కేసులో కొండారెడ్డి ఉండి ఉంటే, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని కేకే రాజు స్పష్టం చేశారు.
అయితే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పోలీసులు ముందుగా కేసు నమోదు చేసి, వాస్తవాలను మీడియాకు చెప్పి, న్యాయస్థానంలో జడ్జి ముందు నిందితులను ప్రొడ్యూస్ చేసి, శిక్ష పడేలా చేయాలన్నారు. అలా కాకుండా చట్ట విరుద్ధంగా, టీడీపీ నాయకులు, కార్యకర్తల్లాగా పోలీసులు వ్యవహరించడం సరికాదని, పోలీసులు విచారణ చేయడం మానేసి టీడీపీ కోసం పనిచేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న అందరినీ బహిర్గతం చేసి, అందరికీ శిక్ష పడేలా చేయాలని కేకే రాజు డిమాండ్ చేశారు.


