
నీటిని పరీక్షించే సదుపాయాలూ లేవు
మహారాణిపేట: ప్రజారోగ్య సంరక్షణలో భాగంగా రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ విభాగాన్ని బలోపేతం చేసేందుకు శాసన సభాపక్ష ఫిర్యాదుల కమిటీ కృషి చేస్తుందని కమిటీ చైర్మన్, డిప్యూటీ స్పీకర్ ఆర్.రఘురామకృష్ణంరాజు అన్నారు. ఫుడ్ సేఫ్టీపై బుధవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫుడ్ సేఫ్టీ విభాగంలో రాష్ట్రవ్యాప్తంగా 500 మంది ఉద్యోగులు అవసరం కాగా.. ప్రస్తుతం కేవలం 25శాతం సిబ్బంది మాత్రమే ఉన్నారని తెలిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాష్ట్ర విభజన తర్వాత నాలుగు లేబొరేటరీలు పూర్తిస్థాయిలో పనిచేయడం లేదని, నీరు, పాల ఉత్పత్తుల కల్తీని పరీక్షించే సదుపాయాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని అధికారులను ఆదేశించారు. నవంబర్ మొదటి వారంలో మొట్టమొదటి రీజనల్ ఫుడ్ లేబొరేటరీ విశాఖపట్నంలో ప్రారంభం కానుందని వెల్లడించారు. ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్‌లో ప్రస్తుతం దేశంలో 29వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని వచ్చే ఏడాదికి కనీసం 15వ స్థానానికి, ఆపై టాప్ 5లోకి తీసుకురావాలని కమిటీ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అర్హత కలిగిన గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందిని ఈ విభాగంలోకి తీసుకోవడం, ఖాళీల భర్తీని వేగవంతం చేయడంపై చర్చించినట్లు తెలిపారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. హీమోఫీలియా చికిత్సను డే కేర్‌లోకి తీసుకురావడం, కేజీహెచ్‌లో వసతులు మెరుగుపరచడంపై అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రతి మూడు నెలలకోసారి పిటిషన్స్ కమిటీ సమావేశాలు విశాఖలోనే జరుగుతాయని ప్రకటించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు తమ పరిధిలో చర్చించిన అంశాలను మీడియాకు వివరించారు. అనంతరం ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. కమిటీ సభ్యులు, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, పి.విష్ణుకుమార్‌రాజు, కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు.
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు