
సీఐఐ సదస్సుకు నగరాన్ని సుందరీకరించండి
డాబాగార్డెన్స్: విశాఖలో వచ్చే నెల 14, 15 తేదీల్లో నిర్వహించనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు నగరాన్ని సుందరీకరించాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్.సురేష్‌కుమార్ ఆదేశించారు. నగరానికి బుధవారం విచ్చేసిన ఆయన సదస్సుకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ హరేందిర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్, ఏయూ వీసీ రాజశేఖర్, జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ ఉన్నతాధికారులు, జోనల్ కమిషనర్లతో కలిసి వీఎంఆర్‌డీఏ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సదస్సుకు సంబంధించి నగరంలో జరుగుతున్న పనుల వివరాలను వివరించారు. అనంతరం ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ సదస్సుకు దేశ విదేశాల నుంచి ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున వస్తారని, అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రధాన రోడ్లు, ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ రోడ్డులో వ్యర్థాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని.. వెంటనే పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. ఆ ప్రాంతంలో ఎక్కువగా చెట్టు పొదలు ఉన్నందున వెంటనే తొలగించాలని సూచించారు. భవన నిర్మాణ వ్యర్థాలు, సామగ్రి రోడ్లపై లేకుండా చూడాలని, సీఅండ్‌డీ ప్లాంట్ నిర్వహణకు చర్యలు చేపట్టాలని చీఫ్ సిటీ ప్లానర్‌ను ఆదేశించారు. తీర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలని, బీచ్‌లో వ్యాపారస్తులు తప్పనిసరిగా డస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేసుకునేలా చూడాలన్నారు. ఓపెన్, క్లోజ్డ్ కాలువల్లో పూడికలు తొలగించాలని, వీధి కుక్కలు, పశువులు, సంచరించకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. సదస్సు ప్రాంతంలో తాత్కాలిక మరుగుదొడ్లు, కంపార్టర్లు, వ్యర్థాలు తరలించే వాహనాలు, నీటి సరఫరా, తగినంత వర్కర్లు, పార్కింగ్ ఏరియాలో సదుపాయాలు ఏర్పాటు చేయాలని ప్రధాన వైద్యాధికారిని ఆదేశించారు. వీధి విక్రయదార్లను గుర్తించి.. వెండింగ్ జోన్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని యూసీడీ పీడీ సత్యవేణిని ఆదేశించారు. డిసెంబర్ నాటికి ఆస్తిపన్ను వసూలు జరగాలని డీసీఆర్ శ్రీనివాసరావును ఆదేశించారు. సమీక్షలో అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి, ప్రధాన వైద్యాధికారి నరేష్‌కుమార్, ప్రధాన సిటీ ప్లానర్ ప్రభాకరరావు, వీఎంఆర్‌డీఏ జాయింట్ కమిషనర్ రమేష్, ప్రధాన ఇంజనీర్ వినయ్‌కుమార్ పాల్గొన్నారు.
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ
ప్రధాన కార్యదర్శి సురేష్‌కుమార్