
చిరుద్యోగికి పగ్గాలు!
మహారాణిపేట : అతడు ఒక చిన్న ఉద్యోగి.. అయినా మొత్తం కార్యాలయ బాధ్యతలన్నీ అతనికే అప్పగించారు. ఆ కార్యాలయంలో ఏ ఫైల్ ముందుకు వెళ్లాలన్నా తొలుత ఈ ఉద్యోగిని ప్రసన్నం చేసుకోవాలి. అతని చెయ్యి తడిపితేనే ఫైల్ కదులుతుంది. లేదంటే ఎన్ని నెలలైనా సరే ఆ ఫైలు అక్కడే ఉంటుంది. కార్యాలయం ఉన్నతాధికారులతోపాటు కొంత మంది రెవెన్యూ ఉన్నతాధికారుల అండ ఉండడంతోనే ఆ చిరుద్యోగి మాట చెల్లుబాటు అవుతోంది. ఇది ఎక్కడో కాదు.. విశాఖ జిల్లాలోని పెదగంట్యాడ తహసీల్దార్ కార్యాలయంలో.. ఇక్కడ గ్రామ రెవెన్యూ అధికారి(వీఆర్‌వో)కి తహసీల్దార్ ఏకంగా ఇన్‌చార్జి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు అప్పగిస్తూ ప్రొసిడింగ్ కూడా జారీ చేశారు. దీనిపై ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)లో ఫిర్యాదు కూడా నమోదైంది.
చిరుద్యోగికి అందలం
పెదగంట్యాడ మండలంలో క్లస్టర్–3లో వీఆర్‌వో దాకురి లక్ష్మీకాంతరావును ఇన్‌చార్జి ఆర్‌ఐగా తహసీల్దార్ నియమించారు. ఈ కార్యాలయంలో తహసీల్దార్‌తోపాటు డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, 33 మంది గ్రేడ్–2 సచివాలయ వీఆర్‌వోలు, ముగ్గురు గ్రేడ్–1 వీఆర్‌వోలు ఉన్నారు. ఇక్కడ ఉన్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ను కాదని.. వీఆర్‌వో డి.లక్ష్మీకాంతరావును ఇన్‌చార్జి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా నియమిస్తూ గత ఏడాది డిసెంబర్ 9వ తేదీన తహసీల్దార్ ప్రొసిడింగ్ ఇచ్చారు. తహసీల్దార్ విశాఖపట్నం ఆర్‌డీవో ద్వారా జాయింట్ కలెక్టర్‌కు ప్రొసిడింగ్ కాపీని పంపారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ల నియామకాన్ని జిల్లా కలెక్టర్ చేపడుతుంటారు. ఇక్కడ తహసీల్దార్ తనకు వత్తాసు పలికే వీఆర్‌వోని ఏకంగా ఇన్‌చార్జి ఆర్‌ఐగా నియమిస్తూ ప్రొసిడింగ్ ఇచ్చేశారు.
ఉద్యోగిపై ఫిర్యాదుల వెల్లువ
ఈ ఉద్యోగిపై ఇప్పటికే పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు మీద విచారణ చేసి, నివేదిక ఇవ్వాలని విశాఖ ఆర్‌డీవోకు కలెక్టర్‌కు సూచించారు. అయినా ఈ ఫిర్యాదు మీద నేటి వరకు ఎలాంటి విచారణ చేయలేదు.. సమాధానం కూడా లేదు. అలాగే మండలంలో అనేక మంది ఫిర్యాదులు చేశారు. వాటిని పట్టించుకునే నాథుడు లేడు. దీంతో కార్యాలయంలో ఇన్‌చార్జి ఆర్‌ఐ పెత్తనం ఇంకా నడుస్తోంది. కార్యాలయంలో ఎలాంటి పనులైనా అతడు ఆమోదం పొందాల్సి ఉంటుంది.వసూళ్లకు కూడా పాల్పడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.