
ఏయూకు స్వయం ప్రతిపత్తి కల్పించాలి
సీతంపేట: ఘన చరిత్ర కలిగిన ఆంధ్రా యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి, సమృద్ధి, ఆర్ధిక పరిపుష్టి కల్పించాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ కోరారు. ముగ్గురు వీసీలు రాసిన ‘ఆంధ్రవిశ్వవిద్యాలయం ప్రగతి నిర్దేశకులు’పుస్తకావిష్కరణ సభ సిడార్ ఆధ్వర్యంలో బుల్లయ్య కళాశాలలో బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఏయూ వందేళ్ల చరిత్రను తెలుగు, ఇంగ్లిష్‌లో రాయడం అభినందనీయమన్నారు. 1958లో ఏయూ విద్యార్థిగా తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. పుస్తక రచయితల్లో ఒకరైన ఆచార్య వి.బాలమోహన్‌దాస్ మాట్లాడుతూ ఏయూలో వీసీల నియామకం ప్రారంభం, ఎంతమంది వీసీలుగా పనిచేశారో వివరించారు. మిగిలిన రచయితలు ప్రొఫెసర్ ఎస్‌వీ సుధాకర్, ఎస్.రామకృష్ణారావులు మాట్లాడుతూ ఏయూ చరిత్ర కలకాలం నిలిచిపోయేలా పుస్తకాన్ని రూపొందించామన్నారు. కార్యక్రమంలో ఏయూ పూర్వ వీసీ జీఎస్‌ఎన్ రాజు, మాజీ వీసీలు కేసీ రెడ్డి, జేవీ ప్రభాకర్, జ్ఞానమణి, ఎన్.వెంకట్రావు, ఏవీ ప్రసాదరావు, సూర్యనారాయణ, ఉమామహేశ్వరరావు, హరినారాయణ, నిరూపారాణి, రైటర్స్ అకాడమీ చైర్మన్ వీవీ రమణమూర్తి, బుల్లయ్య కళాశాల కరస్పాండెంట్ జి.మధుకుమార్ పాల్గొన్నారు.