కూటమివి గ్యాస్‌కబుర్లే.. | - | Sakshi
Sakshi News home page

కూటమివి గ్యాస్‌కబుర్లే..

Oct 23 2025 9:26 AM | Updated on Oct 23 2025 9:26 AM

కూటమివి గ్యాస్‌కబుర్లే..

కూటమివి గ్యాస్‌కబుర్లే..

గ్యాస్‌ రాయితీ చెల్లింపులకు చుక్కలు

నవంబర్‌తో ముగుస్తున్న

మూడో విడత బుకింగ్‌లు

రోజులు గడుస్తున్నా డబ్బులు

జమ కాకపోవడంతో మహిళల గగ్గోలు

మహారాణిపేట: కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన కీలక హామీల్లో ఒకటైన ‘ఏడాదికి మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్ల’పథకం అమలు అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా మూడో విడత చెల్లింపుల్లో లబ్ధిదారులకు చుక్కలు కనబడుతున్నాయి. సిలిండర్‌ డెలివరీ తీసుకుని రోజులు గడుస్తున్నా.. రాయితీ డబ్బులు మాత్రం ఖాతాల్లో జమ కాకపోవడంతో మహిళలు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాయితీ కోసం ఎదురుచూపు

విశాఖ జిల్లా గణాంకాలే ఈ పథకం అమలులోని డొల్లతనాన్ని స్పష్టం చేస్తున్నాయి. మూడో విడతలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 3,46,110 మంది లబ్ధిదారులు సిలిండర్లను డెలివరీ తీసుకున్నారు. అయితే వీరిలో కేవలం 87 వేల మందికి మాత్రమే ఇప్పటివరకు రాయితీ సొమ్ము రూ.8.35 కోట్లు వారి ఖాతాలకు జమ అయ్యింది. అంటే సుమారు 2.59 లక్షల మంది లబ్ధిదారులు తాము చెల్లించిన డబ్బుల కోసం పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. ఆగస్టులో ప్రారంభమైన మూడో విడత బుకింగ్‌లు నవంబర్‌ 30తో ముగియనున్నాయి. అక్టోబర్‌ చివరి వారం నడుస్తున్నా.. ఇంత భారీ సంఖ్యలో చెల్లింపులు నిలిచిపోవడం గమనార్హం.

కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు

రాయితీ డబ్బుల కోసం లబ్ధిదారులు సివిల్‌ సప్లైస్‌ డీఎస్‌వో, ఏఎస్‌వో కార్యాలయాలకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. ఈ రోజు, రేపు అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారే తప్ప, స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదని బాధితులు వాపోతున్నారు. అనుమానాల నివృత్తి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్‌ ఫ్రీ నంబర్‌(1800–2333–555) కూడా ఏమాత్రం ఉపయోగపడటం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మాటలకు, చేతలకు పొంతన ఏది?

క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా ఉంటే.. సిలిండర్‌ డెలివరీ అయిన 48 గంటల్లోగా డీబీటీ విధానం ద్వారా లబ్ధిదారుల ఖాతాలో నేరుగా రాయితీ సొమ్ము జమ అవుతుందని డీఎస్‌వో వి.భాస్కర్‌ చెబుతున్నారు. కానీ, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో సిలిండర్లు తీసుకున్న వారికి కూడా అక్టోబర్‌ చివరి నాటికి డబ్బులు పడలేదు. అధికారుల ప్రకటనలకు, క్షేత్రస్థాయి అమలుకు మధ్య ఉన్న ఈ భారీ వ్యత్యాసం ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తోంది.

నిబంధనలతో అవస్థలు

ఎన్నికల ముందు ఎటువంటి షరతులు లేకుండా ప్రతి ఒక్కరికీ మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం మెలికలు పెడుతోందని మహిళలు ధ్వజమెత్తుతున్నారు. తెలుపు రేషన్‌ కార్డు (రైస్‌ కార్డు) పనిచేస్తేనే ఉచిత గ్యాస్‌ అని నిబంధన పెట్టడం వల్ల మధ్యతరగతి మహిళలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దీనికి తోడు ఈకేవైసీ, ఆధార్‌–బ్యాంకు ఖాతా అనుసంధానం వంటి సాంకేతిక కారణాలతో చాలా మందికి రాయితీ సొమ్ము దక్కడం కష్టంగా మారింది. ఎన్నికల ముందు ఒకలా, ఇప్పుడు మరోలా వ్యవహరించడం మోసమేనని వారు మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement