
నేటి నుంచి గ్రేట్ విశాఖ షాపింగ్ ఫెస్టివల్
మహారాణిపేట: జీఎస్టీ 2.0(సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్) కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరిగే ది గ్రేట్ వైజాగ్ షాపింగ్ ఫెస్టివల్‌ను విజయవంతం చేయాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ కోరారు. ఏయూ గ్రౌండ్స్‌లో షాపింగ్ ఫెస్టివల్ నిర్వహణ ఏర్పాట్లను కలెక్టర్ బుధవారం పరిశీలించారు. వివిధ రంగాలకు చెందిన వ్యాపార సంస్థల సౌజన్యంతో ఏర్పాటు చేస్తున్న స్టాళ్లను పరిశీలించారు. 60కి పైగా షాపులు ఏర్పాటు చేస్తున్నారని, ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఫెస్టివల్ జరుగుతుందని తెలిపారు. జీఎస్టీ తగ్గిన నేపథ్యంలో మార్కెట్ ధర కంటే తక్కువ రేటుకు వస్తువులు ఫెస్టివల్‌లో లభిస్తాయని, విశాఖ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
ఏయూలో పార్టనర్‌షిప్ సమ్మిట్
ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో నవంబర్ 14, 15 తేదీల్లో నిర్వహించనున్న పార్టనర్‌షిప్ సమ్మిట్ ఏర్పాట్లను కూడా కలెక్టర్ పరిశీలించారు. సమ్మిట్ నిర్వహణ కోసం తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు సమ్మిట్‌లో పాల్గొనేందుకు వచ్చే మార్గాలను, డెలిగేట్లు, ఇతర ప్రముఖులు, పాల్గొనేందుకు వచ్చే వారికి చేపట్టాల్సిన ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. అలాగే దీపావళి సందర్భంగా బాణసంచా సామగ్రి విక్రయించే స్టాళ్లను ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానం రోడ్డుకు అవతల వైపు ఉన్న మైదానాన్ని వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్టేట్ జీఎస్టీ అదనపు కమిషనర్ ఎస్.శేఖర్, టూరిజం అధికారి జె. మాధవి, జీవీఎంసీ, రెవెన్యూ, పోలీస్, సీఐఐ అధికారులు పాల్గొన్నారు.