
2026 నాటికి మాస్టర్ ప్లాన్ రోడ్లు పూర్తి
మహారాణిపేట: విశాఖలో భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా మౌలిక వసతులను భారీగా అభివృద్ధి చేస్తున్నట్లు కలెక్టర్ హరేందిర ప్రసాద్ తెలిపారు. ఇందులో భాగంగా 15 మాస్టర్ ప్లాన్ రోడ్లను నిర్మిస్తున్నామని, వీటిలో ఏడింటి టెండర్లు పూర్తయ్యాయని, త్వరలో పనులు మొదలవుతాయని చెప్పారు. ఈ రోడ్లను 2026 ఏప్రిల్/మే నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీని ద్వారా 50 నిమిషాల్లో నగరం నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేరుకోవచ్చని తెలిపారు. తాగునీటి కోసం పోలవరం ఎడమ కాలువ నుంచి నీటిని తెచ్చేందుకు ప్రణాళికలు ఉన్నాయని, అలాగే 24 చెరువులను ఆధునీకరిస్తున్నామని పేర్కొన్నారు. గూగుల్ డేటా సెంటర్ రాకతో విశాఖ రూపురేఖలు మారుతాయని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
16 నుంచి 19 వరకు షాపింగ్ ఫెస్టివల్ : జీఎస్టీ 2.0 సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమాల్లో భాగంగా నాలుగు రోజుల పాటు ఏయూ ఇంజినీరింగ్ మైదానంలో ఫెస్టివల్‌ను నిర్వహించనున్నారు. కలెక్టర్ హరేందిర ప్రసాద్ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఇందులో ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఆహార తయారీ వంటి సంస్థల నుంచి సుమారు 60 స్టాళ్లు ఉంటాయని తెలిపారు. జీఎస్టీపై అవగాహన శిబిరం, సాంస్కృతిక కార్యక్రమాలు, లక్కీ డ్రా వంటివి కూడా ఉంటాయని, ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. వినియోగదారులకు చేకూరుతున్న జీఎస్టీ ప్రయోజనాలను వివరించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో స్టేట్ జీఎస్టీ అదనపు కమిషనర్ ఎస్. శేఖర్, అసిస్టెంట్ కమిషనర్ రాంబాబు, టూరిజం అధికారిణి జె. మాధవి, హోటల్స్ అండ్ టూరిజం అసోసియేషన్ ప్రతినిధి పవన్ కార్తీక్ , ఇతర అధికారులు పాల్గొన్నారు.