
నేటి నుంచి మరోసారి దివ్యాంగుల సర్టిఫికెట్ల పరిశీలన
మహారాణిపేట: జిల్లాలో వివిధ కేటగిరీల కింద ఇస్తున్న దివ్యాంగుల పింఛన్ల రీ–వెరిఫికేషన్‌కు అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది. గతంలో అనర్హులుగా తేలిన 1150 మంది దివ్యాంగుల పింఛన్లను మరోసారి పరిశీలించడానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఏర్పాట్లు చేశాయి. 40 శాతం లోపు వైకల్యం ఉన్న సదరం సర్టిఫికెట్లను వైద్యుల చేత రీ–వెరిఫికేషన్ చేయనున్నారు. ఇందులో భాగంగా బుధవారం నగరంలోని నాలుగు ఆస్పత్రులలో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.జిల్లాలో మొత్తం 21,306 మంది దివ్యాంగులు ఉండగా, ఇప్పటికే 16,187 మందికి రీ–వెరిఫికేషన్ పూర్తయింది. మిగిలిన 5,119 మందికి ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. గతంలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు గుర్తించిన 1150 మంది పింఛన్లు నిలిపివేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సచివాలయ ఉద్యోగుల ద్వారా నోటీసులు జారీ చేసిన తర్వాత, దివ్యాంగులు అప్పీల్ దరఖాస్తులు చేసుకుని, ఆందోళన చేపట్టడంతో రెండు నెలల పాటు పింఛన్లు ఇచ్చి, ప్రస్తుతం రీ–వెరిఫికేషన్ చేస్తున్నారు. ఎంపిక చేసిన ఈ నాలుగు ఆసుపత్రులలో బుధ, గురు, శుక్రవారాల్లో 40 శాతం లోపు ఉన్న సదరం సర్టిఫికెట్లను వెరిఫై చేస్తారు.
ఆస్పత్రులు దివ్యాంగుల సంఖ్య
కేజీహెచ్ 25 మంది
అగనంపూడి ఆసుపత్రి 25 మంది
ప్రాంతీయ కంటి ఆసుపత్రి 20 మంది
పెదవాల్తేరు ఈఎన్‌టీ ఆసుపత్రి ఇద్దరు