
సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న ముగ్గురు అరెస్ట్
విశాఖ సిటీ: సైబర్ మోసాల ద్వారా బాధితుల నుంచి దోచుకున్న డబ్బును ’మ్యూల్ అకౌంట్ల’ ద్వారా ఉపసంహరించి వాటిని సైబర్ నేరగాళ్లకు క్రిప్టోకరెన్సీగా మార్చి అందించిన ముగ్గురు వ్యక్తులను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి సోమవారం రిమాండ్‌కు పంపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూర్మన్నపాలెం ప్రాంతంలో నివాసముంటున్న స్టీల్‌ప్లాంట్ ఉద్యోగికి టెలిగ్రామ్ యాప్‌లో ‘గోద్రేజ్ ప్రాపర్టీస్’ పేరు మీద ఉన్న గ్రూప్‌లో యాడ్ చేసి, ఇంటి వద్దే పార్ట్‌టైమ్ జాబ్ చేసుకోవచ్చని సందేశం వచ్చింది. అది నిజమని నమ్మి, వారు పంపించిన లింకులో అతను తన వివరాలు నమోదు చేసుకున్నాడు. అతనికి ‘5 స్టార్ రేటింగ్స్’ ఇచ్చే పనిని అప్పగించారు. మొదట్లో కొన్ని టాస్కులు పూర్తి చేసిన తరువాత లాభాలు కూడా అందడంతో అతనికి నమ్మకం ఏర్పడింది. తర్వాత ఫైజా అనే వ్యక్తి తాను సీబీఏవో అనే కంపెనీకి సలహాదారునిగా పనిచేస్తున్నానని చెబుతూ.. ఇందులో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మబలికాడు. ఇలా ఎన్‌ఈఎఫ్‌టీ, ఐఎంపీఎస్, యూపీఐ మార్గాల ద్వారా డబ్బులు పంపించమని కోరారు. ఆ సూచనల ప్రకారం బాధితుడు మొత్తం రూ.15.51 లక్షలు వివిధ బ్యాంకు లావాదేవీల ద్వారా జమ చేశారు. లాభాలు రాకపోగా.. డబ్బు విడుదల చేయాలంటే మరింత మొత్తం చెల్లించాలంటూ మోసగాళ్లు పదేపదే డిమాండ్ చేయడం ప్రారంభించారు. దీంతో మోసపోయినట్లు గ్రహించి వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రూ.2.5 కోట్లు లావాదేవీలు
నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొదటిగా బ్యాంక్ లావాదేవీలు, యూపీఐ పేమెంట్ లింకులు, టెలిగ్రామ్ గ్రూప్ ఐపీ లాగ్‌లు, ఫేక్ వెబ్‌సైట్‌లను విశ్లేషించారు. ఈ ప్రక్రియలో అనేక లేయర్‌ల ద్వారా డబ్బు తిరిగి, తిరిగి చివరకు నంద్యాల జిల్లాకు చెందిన షేక్ సఫియుర్ రెహ్మాన్, షేక్ అబ్దుల్ రెహ్మాన్, షేక్ హుస్సేన్ వలీ ఖాతాల్లోకి చేరినట్లు తేలింది. వీరు సుమారు 15 బ్యాంక్ అకౌంట్ల ద్వారా క్యాష్ డిపాజిట్లు, సీఎండీ లావాదేవీలు, యూఎస్‌డీటీ కొనుగోళ్లు, అమ్మకాలు జరిపారు. టెలిగ్రాంలో పరిచయమైన జేఎండీ అకౌంట్‌లో సుమారు రూ.2.5 కోట్లు క్రిప్టోకరెన్సీ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఇందులో సఫియూర్ రెహ్మాన్‌కు సహకరించిన అబ్దుల్ రెహ్మాన్, షేక్ హుస్సేన్ వలీలను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ నేరాలకు వినియోగిస్తున్న బ్యాంక్ అకౌంట్స్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కోర్టులో ప్రవేశ పెట్టగా, వారికి 15 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడి కోసం పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.

సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న ముగ్గురు అరెస్ట్

సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న ముగ్గురు అరెస్ట్