
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌కు 271 వినతులు
మహారాణిపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వచ్చిన ఫిర్యాదులను పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి, పునరావృతం కాకుండా సంతృప్తికరమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవా రం కలెక్టరేట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి కలెక్టర్ వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీదారుడు సంతృప్తి చెందేలా సత్వర, శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్, జీవీఎంసీ విభాగాలకు సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రీ–ఓపెన్ అవుతున్న అర్జీలపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై పరిష్కరించిన అర్జీలకు సంబంధించి అర్జీదారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడతానని కలెక్టర్ తెలిపారు. సోమవారం పీజీఆర్‌ఎస్‌కు మొత్తం 271 వినతులు అందాయి. వీటిలో రెవెన్యూకు 82, పోలీస్‌కు 15, జీవీఎంసీకి 86, ఇతర విభాగాలకు 88 ఫిర్యాదులు ఉన్నాయి. జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వర్మ తదితర అధికారులు వినతులు స్వీకరించారు.