
కూటమిలో కుప్పిగంతులు
డాబాగార్డెన్స్: కూటమిలో కల్లోలం మొదలైంది. ఇందుకు జనసైనికులు, టీడీపీ కార్యకర్తల వైఖరే కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న కార్యకర్తలు అధికార పక్షంలోకి వెళ్లడం చూస్తుంటాం. కానీ ఇక్కడ విచిత్రంగా, కూటమిలో భాగమైన జనసేన కార్యకర్తలు టీడీపీలోకి, టీడీపీ కార్యకర్తలు జనసేనలోకి మారుతూ ‘దోబూచులాట’ఆడుతున్నారు. ఈ వింత పోకడ కూటమిలో గందరగోళానికి దారితీస్తోంది.జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం కూటమి ధర్మాన్ని పాటించాలని, టీడీపీ వారితో అణిగిమణిగి ఉండాలని జనసైనికులకు పదేపదే సూచిస్తున్నారు. అయితే దిగువశ్రేణి జనసైనికులు మాత్రం అధినేత మాటలను పక్కన పెడుతున్నట్లుగా వారి చేష్టల ద్వారా స్పష్టమవుతోంది. దీంతో కింది స్థాయి కార్యకర్తల్లో ఏ స్థాయిలో సమన్వయ లోపం ఉందో ఇట్టే అర్థమవుతోంది.
నిన్నటికి మొన్న..
సేనాని (పవన్ కల్యాణ్) సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు సమక్షంలో 29వ వార్డుకి చెందిన ఈశ్వరరావు అండ్ బృందం జనసేన కండువా కప్పుకుంది. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సమక్షంలోనే జనసేన తీర్థం పుచ్చుకున్నారు. కండువా ఇస్త్రీ మడత చెరిగిపోకముందే..వారంతా టీడీపీ పంచన చేరారు. ఇదీ కూటమి ప్రభుత్వం..నేతల్లో వింత పోకడగా మారింది.
దక్షిణ నియోజకవర్గంలోని 29వ వార్డులో ఆదివారం టీడీపీ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జనసేన పార్టీకి చెందిన కొంత మంది యువకులు కార్పొరేటర్ ఉరికూటి నారాయణరావు నేతృత్వంలో టీడీపీ కండువా కప్పుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. జనసేన కార్యకర్తలు టీడీపీలో చేరడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
లోకేశ్‌ను సీఎం చేసే వరకు నిద్రపోవద్దు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్ సీతంరాజు సుధాకర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో విస్మయం కలిగించాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఉన్నప్పటికీ, టీడీపీ కార్యకర్తలు లోకేశ్‌ను సీఎం చేసే వరకు నిద్రపోవద్దని ఆయన పిలుపునివ్వడం గమనార్హం. అయితే సుధాకర్ తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ ‘చంద్రబాబునాయుడు వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాధించి, మరో ఐదేళ్లపాటు ముఖ్యమంత్రి పదవిలో ఉంటారు. ఆ తర్వాత లోకేశ్ సీఎం పదవి చేపట్టేందుకు ఇప్పటి నుంచే కష్టించి పని చేయాలి’ అని వివరణ ఇచ్చారు. పార్టీలో చేరిన ఈశ్వరరావుకు నియోజకవర్గ యువత బాధ్యత అప్పగించినట్లుగా కూడా ఈ సందర్భంగా తెలిపారు.
వంశీకృష్ణను కాదని...
సీతంరాజును గెలిపించాలి
మరోవైపు 29వ వార్డు కార్పొరేటర్ ఉరుకూటి నారాయణరావు చేసిన వ్యాఖ్యలు జనసేన నాయకులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. కూటమి తరఫున గెలిచిన జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ను కాదని, వచ్చే ఎన్నికల్లో సీతంరాజు సుధాకర్‌ను దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి ఇప్పటి నుంచే అడుగులు ముందుకు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. పలువురు జనసేన కార్యకర్తలు టీడీపీలో చేరడంతో పార్టీ బలోపేతమైందని ఉరుకూటి అనడం, నియోజకవర్గంలో జనసేన బలం తగ్గిందన్నట్లుగా ఉందంటూ జనసేన నాయకులు, కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు.
29వ వార్డులో తారాస్థాయికి చేరిన కుంపటి
జీవీఎంసీ 29వ వార్డులో కూటమి నేతల మధ్య అంతర్గత లొల్లి తారాస్థాయికి చేరింది. జనసేన నుంచి టీడీపీలోకి, టీడీపీ నుంచి జనసేనలోకి కార్యకర్తలు చేరడం ఈ గందరగోళాన్ని మరింత పెంచుతోంది. వార్డు కార్పొరేటర్ ఉరుకూటి నారాయణరావుకి, ఆ పార్టీ వార్డు అధ్యక్షుడి మధ్య గ్యాప్ పెరుగుతుండగా, జనసేన నాయకుల మధ్య కూడా పొరపొచ్చాలు ఎక్కువై, కూటమి కుంపటి రగులుతోంది.

కూటమిలో కుప్పిగంతులు