తగరపువలస: ఆనందపురం మండలం పందలపాక పంచాయతీ బాకూరుపాలెం సర్వే నంబర్ 71లోని రూ.4 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిలో టీడీపీ నేతల కన్ను పడింది. ఆ పార్టీ నేతలు వెన్ని రమణ, రాజు, సత్యవతి గతంలో దౌర్జన్యం చేసి నీలగిరి మొక్కలు వేశారు. అలాగే నెలరోజుల క్రితం అదే స్థలంలో మామిడిమొక్కలు వేయడానికి ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. పందలపాక నుంచి తర్లువాడకు వెళ్లే మార్గంలో బాకూరుపాలెంలో ఉన్న ఈ విలువైన భూమిని గ్రామ అవసరాలకు వినియోగించుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఈ స్థలంలో అంగన్వాడీ భవనాన్ని నిర్మించుకునేందుకు పంచాయతీ పాలకవర్గం ఎం బుక్‌లో కూడా రికార్డు చేసింది. మళ్లీ మూడు రోజుల క్రితం టీడీపీ నాయకులు ఇదే స్థలంలో ట్రాక్టర్లతో దున్ని మొక్కలు వేయడానికి ప్రయత్నించగా వీఆర్వో దుర్గా రమేష్ అడ్డుకున్నారు. ఈ స్థలంపై టీడీపీ నాయకులతో విబేధాల కారణంగా ఇది వరకే బాకూరుపాలెం గ్రామస్తులు సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తీర్పు వెలువడవలసి ఉండగా నాయకులు టీడీపీలో ప్రముఖుల పేర్లు చెపుతూ దౌర్జన్యం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇదిలావుండగా కబ్జాకు పాల్పడుతున్న వారు టీడీపీకి చెందినవారు కాదని పంచాయతీకి చెందిన ఆ పార్టీ నాయకులు తప్పించుకు తిరుగుతున్నారు. కోర్టు వివాదంలో ఉన్న ఈ విలువైన స్థలంలో తరచూ టీడీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడుతూ గ్రామంలో అశాంతి కలిగిస్తున్నా ఆనందపురం రెవెన్యూ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని బాకూరుపాలెం ప్రజలు వాపోతున్నారు. విలువైన స్థలాన్ని గ్రామ అవసరాలకే ఉపయోగపడాలంటున్నారు. అధికార పార్టీ అండ చూసుకుని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
ఈ విషయాన్ని పందలపాక వీఆర్వో దుర్గా రమేష్ దృష్టికి మరోమారు తీసుకురాగా కోర్టు తీర్పు పెండింగ్‌లో ఉన్నందునే జోక్యం చేసుకోలేకపోతున్నామన్నారు. ఈ విషయాన్ని తహసీల్ధార్ శ్రీనుబాబు దృష్టికి తీసుకువెళ్లానన్నారు. వెన్ని కుటుంబ సభ్యులు తమ వద్ద ఈ స్థలానికి సంబంధించి పట్టాలు ఉన్నాయన్నారన్నారు. కానీ అవి తమ వద్ద ఉన్న రికార్డులతో సరిపోవడం లేదన్నారు. మూడు రోజుల క్రితం సర్వే నంబర్ 71లో దున్నడానికి వస్తే అడ్డుకున్నామన్నారు. కోర్టు తీర్పు వచ్చే వరకు ఈ స్థలంలో ఎలాంటి మొక్కలు, నిర్మాణాలు చేపట్టకూడదన్నారు.