
పల్లె వైద్యంపై సమ్మె ప్రభావం
మహారాణిపేట: సమ్మెలో భాగంగా జిల్లాలోని పది పీహెచ్‌సీల్లో 20 మంది వైద్యులు సమ్మె బాట పట్టారు. ఇందులో భీమిలి, రేవిడి, ఆర్.తాళ్లవ లస, ఆనందపురం, శోంఠ్యాం, మధురవాడ, కణితదేవాడ, గాజువాక, పెదగంట్యాడ వంటి ప్రాంతాల వైద్యులు ఉన్నారు. గత నెల 29 నుంచి వైద్యులు ఔట్ పేషెంట్ సేవలను పూర్తిగా బహిష్కరించారు. అంతకుముందు 26వ తేదీ నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించడంతో పాటు, అధికారిక కార్యక్రమాలు, రోగుల పేర్ల నమోదు ప్రక్రియ మరియు అధికారిక వాట్సప్ గ్రూప్‌ల నుంచి బయటకు వచ్చారు. గత నెల 26 నుంచి ఆన్‌లైన్‌లో రోగులు, వారి వివరాలను నమోదు చేయకుండా నిలిపివేశారు. దీనివల్ల ప్రతిరోజు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు పంపాల్సిన ముఖ్యమైన ఆరోగ్య సమాచారం నిలిచిపోయింది. ‘స్వస్త్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్’ కింద జరుగుతున్న నేషనల్ కమ్యూనికబుల్ డిసీజెస్ 4.0 సర్వే, క్యాన్సర్ స్కానింగ్ పరీక్షలను కూడా బహిష్కరిస్తున్నట్లు యూనియన్ నేత డాక్టర్ జగదీష్ తెలిపారు. సంచార చికిత్సలు, ఇతర మెడికల్ క్యాంపుల నుంచి కూడా వైద్యులు దూరంగా ఉంటున్నారు.
రేపు విజయవాడలో దీక్షలు
అత్యవసర వైద్య సేవల్లో భాగంగా కేవలం డెలివరీలు, పాము కాటు, పాయిజనింగ్ కేసులకు మాతమ్రే ఇంతవరకు చికిత్సలు అందించారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే శుక్రవారం విజయవాడలో రిలే నిరాహార దీక్షలు చేస్తామని అసోసియేషన్ నాయకుడు డాక్టర్ జగదీష్ ప్రకటించారు.
నర్సులే డాక్టర్లు
కొన్ని పీహెచ్‌సీల్లో వైద్యులు లేకపోవడంతో నర్సులు, ఫార్మసిస్టులు వైద్యుల అవతారం ఎత్తి రోగులను చూస్తున్నారు. గ్రామాల్లో సంచార వైద్యసేవలు నిలిచిపోవడంతో, రోగులు స్థానికంగా ఉండే ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. పరిస్థితి సీరియస్‌గా ఉంటే విశాఖ నగరానికి పరుగులు తీయాల్సి వస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి, వైద్యుల డిమాండ్లను పరిష్కరించి, గ్రామీణ ప్రజలకు నిరాటంకంగా వైద్య సేవలు అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద ఆందోళన
తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామీణ వైద్యులు బుధవారం సాయంత్రం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని, ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలని వైద్యులు ఈ సందర్భంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ విధానాల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు సక్రమంగా అందించలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్లు పరిష్కరించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని వైద్యులు స్పష్టం చేశారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెలోకి దిగడంతో పల్లె ప్రాంతాల్లో వైద్య సేవలు పూర్తిగా పడకేశాయి. దీని ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. పీహెచ్‌సీ వైద్యులు తమ సమస్యల పరిష్కారం కోసం గత నెల 26వ తేదీ నుంచే ఆందోళన కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రభుత్వ వైద్యులు ప్రధా నంగా జీవో నం. 99 ద్వారా కోత విధించిన ఇన్–సర్వీస్ పీజీ కోటా పునరుద్ధరణ, పదోన్నతుల కల్పన, గిరిజన అలవెన్స్‌లు, 104 సంచార చికిత్స అలవెన్స్‌ల అమలు వంటి డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. ఇవి పరిష్కారం కాకపోవడంతో సమ్మె బాట పట్టారు.
రోగుల పడిగాపులు
వైద్యులు సమ్మెలోకి వెళ్లడంతో గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీలు వెలవెలబోతున్నాయి. రోజుకు 74 నుంచి 140 మంది వరకు ఓపీ నమోదు అయ్యే కేంద్రాలు నేడు బోసిపోయి, వైద్యుల కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వైద్యం కోసం వచ్చిన రోగులు, ముఖ్యంగా గర్భిణులు, తీవ్ర అవస్థలు పడుతూ పడిగాపులు కాస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ కొందరు వైద్యులను ప్రత్యామ్నాయంగా నియమించినప్పటికీ, వారు గత వైద్యుల వలే పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండడం లేదు. ఏదో మొక్కుబడిగా సేవలు అందిస్తున్నారు.