
భలే మందుస్తు ఏర్పాట్లు
దసరా వచ్చిందంటే చాలు... చాలామందికి మందు, ముక్క లేకుండా పండగ అస్సలు మొదలైనట్టే కాదు.. ఈ రెండూ ఉంటేనే ఆ రోజుకి అసలు ‘జోష్’ వచ్చినట్టు. ఈ ఏడాది అసలు ట్విస్ట్ ఏంటంటే... దసరా పండగ సరిగ్గా గాంధీ జయంతి రోజునే వచ్చింది. ‘నియమం’ ప్రకారం, ఈ శుభదినాన ప్రభుత్వం మద్యం దుకాణాలు, మాంసం దుకాణాలు రెండింటికీ సెలవు ప్రకటించింది. అంటే పండగ రోజున మందు బాబుల ‘హోమ్ డెలివరీ’కి కూడా దారి లేదన్నమాట..‘ఏం? పండగని ఆపేస్తారా? మా ఆనందాన్ని ఆపగలరా?’ అంటూ మద్యం ప్రియులు రంగంలోకి దిగారు. గురువారం షాపులు మూతపడతాయని తెలియగానే, బుధవారాన్ని వాళ్లు ‘అంతర్జాతీయ అత్యవసర నిల్వల దినోత్సవం’ గా మార్చేశారు. వైన్‌షాపుల ముందు క్యూ చూస్తే, అంతా తమ ఇళ్లలో కనీసం నెల రోజులకు సరిపడా ‘ద్రవ్య నిల్వలు’ పెట్టుకోవడానికి వచ్చినట్టు అనిపించింది. వీళ్ల ప్రణాళిక చూసి చాలా మంది ముక్కున వేలేసుకున్నారు. వైన్‌షాపుల ముందు గుమిగూడిన జనాన్ని చూసి, పక్కన ఉన్నవాళ్లంతా దసరా జోష్ అంటే ఇదే కదా.. అంటూ చమత్కరించారు. ఇక మాంసం దుకాణాల వద్ద రద్దీ అయితే ఇంకో లెవల్..మటన్, చికెన్ ముక్కలు కొని, పావడకుండా ఉండేందుకు ‘ఐస్ క్యూబ్ ప్లానింగ్’ ఎలా చేయాలో ఒకరికొకరు సలహాలు ఇచ్చుకున్నారు. ‘ముక్కను ఫ్రిజ్‌లో దాచడం ఒక కళ, దాన్ని సేఫ్‌గా పండగ రోజు వరకూ ఉంచడం ఒక విజ్ఞానం’ అంటూ డిస్కషన్లు పెట్టుకున్నారు. –సీతంపేట
అక్కయ్యపాలెంలో మద్యం దుకాణం వద్ద