
సైబర్ మోసాలపై అప్రమత్తం
మహారాణిపేట: ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యతను మరింత పెంచాలని, సైబర్ మోసాలపై అప్రమత్తం చేయాలని జిల్లాలోని వివిధ బ్యాంకుల ప్రతినిధులను ఉద్దేశించి కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో జరిగిన జూన్ క్వార్టర్ బ్యాంకర్ల జిల్లాస్థాయి సమీక్షా కమిటీ సమావేశంలో ఆయన పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్, అర్బన్, రూరల్ ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన శిబిరాలు, ర్యాలీలు నిర్వహించాలని చెప్పారు. అధిక మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగే సమయంలో బ్యాంకర్లు సునిశిత పరిశీలన చేయాలని, అనుకోని రీతిలో ఎవరైనా ఒత్తిడికి గురైనా, సందేహస్పద వ్యవహారశైలి ఉన్నా గమనించి తగిన చర్యలు చేపట్టాలని, ఆపదలో ఉన్నవారికి సహకారం అందించాలని పేర్కొన్నారు. విశాఖలో ఇటీవల జరిగిన పలు ఘటనలను సోదాహరణంగా వివరిస్తూ బ్యాంకర్లు ప్రజలకు ఇలాంటి విషయాల్లో అండగా నిలవాలని హితవు పలికారు. సామాన్యులు, రైతుల ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని, సులభతర విధానంలో రుణాలు మంజూరు చేయాలని సూచించారు. స్వయం ఉపాధి నిమిత్తం వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే వారికి పూర్తిస్థాయి సహకారం అందించాలన్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా చేపట్టబోయే ప్రాజెక్టులకు బ్యాంకులు మద్దతు తెలిపాలని, కొత్త కొత్త ప్రాజెక్టులతో వచ్చే వారికి సహకారం అందించాలని సూచించారు. సమావేశంలో భాగంగా, ముందుగా గత క్వార్టర్‌లో నిర్వహించిన సమావేశం తాలూకు లక్ష్యాలను, ఫలితాలను విశ్లేషించారు. జూన్ క్వార్టర్‌లో చేపట్టాల్సిన కార్యాచరణపై అధికారులకు, బ్యాంకర్లకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. రుణాల నిమిత్తం ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిశీలించి చర్యలు చేపట్టాలన్నారు. గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రాల కార్యకలాపాలను పెంచాలని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అధికారులకు చెప్పారు. ఎల్డీఎం శ్రీనివాసరావు, ఆర్బీఐ ప్రతినిధులు, వివిధ బ్యాంకుల మేనేజర్లు, పలు శాఖల జిల్లా స్థాయి అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ హరేందిర ప్రసాద్