
పీలా...ఢీలా
డాబాగార్డెన్స్: జీవీఎంసీ స్థాయీ సంఘం సమావేశం.. మేయర్, స్థాయీ సంఘం చైర్మన్ పీలా శ్రీనివాసరావు, బీజేపీ కార్పొరేటర్ గంకల కవిత మధ్య తీవ్ర వాగ్వాదానికి వేదికై ంది. సమావేశానికి కమిషనర్ వస్తారని మేయర్ చెప్పగా, ‘కమిషనర్ ఊర్లో లేరని మీకు తెలియదా? లేక తెలిసీ అడుగుతున్నారా?’ అంటూ కవిత నిలదీశారు. దీనికి మేయర్ స్పందిస్తూ మీరు కూర్చోండి. ఏమైనా ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడుకుందాం అనడంతో వివాదం మరింత రాజుకుంది. మీతో మాకు పర్సనల్ ఏముంటాయని ప్రశ్నించారు. మీరు మేయర్‌గా కాకుండా కేవలం చైర్మన్‌గా మాత్రమే వచ్చారు. మేము కూడా ప్రజలతో ఎన్నికయ్యాం. సమావేశం సోమవారం అయితే మాకు ఆదివారం చెబుతారా? మీరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. దీనికి పీలా శ్రీనివాసరావు ఇది అత్యవసర సమావేశం. ఇష్టం లేని వారు వెళ్లిపోవచ్చు అని బదులిచ్చారు. అంతేకాకుండా, స్థాయీ సంఘంలో మీకు స్థానం కల్పించింది నేను, నా పార్టీ నుంచి మీకు అవకాశం ఇచ్చాను అని మేయర్ తీవ్రంగా మండిపడ్డారు. మీరు మాకు క్లాసులు చెబుతారా? మీ వ్యవహార శైలి బాగాలేదు అంటూ కవిత..మేయర్‌పై విరుచుకుపడ్డారు.
జిరాయితీ భూమికి ప్లానింగ్ ఎలా?
శానాపతి వసంత మాట్లాడుతూ జిరాయితీ భూమికి అధికారులు ప్లానింగ్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. దానికి చైర్మన్ స్పందిస్తూ, సంబంధిత అధికారులు లేరు, ఆ విషయం వదిలేయండి.. అని చెప్పగా, సభ్యురాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో కూడా నేను స్థాయీ సంఘంలో ఉన్నాను, అప్పుడు అధికారులంతా అందుబాటులో ఉండేవారు. ఇప్పుడు అధికారులు లేకపోతే ఎలా? అని మేయర్‌ను ప్రశ్నించారు. బంజరు భూమిలో రోడ్డు వేయగలమా అని ప్రశ్నిస్తూ, దీనిపై విచారణ చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.
అభివృద్ధి పనులు ఎక్కడ?
అనేకసార్లు విజ్ఞప్తులు చేసినా, వార్డుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్ లేదని అధికారులు చెబుతున్నారని పలువురు సభ్యులు మండిపడ్డారు. నవంబర్‌లో జరిగే సదస్సుకు రూ. 40 కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ‘నగరాభివృద్ధి, సుందరీకరణకు మేము వ్యతిరేకం కాదు. కానీ మా వార్డుల పరిస్థితి ఏమిటి? మరో నాలుగైదు నెలల్లో పదవీకాలం ముగుస్తుంది, తిరిగి ఎన్నికలకు వెళ్లాలంటే మేము చేసిన అభివృద్ధి చూపించాలా వద్దా?’ అని ప్రశ్నించారు. కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా తాము విఫలమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
అన్ని అంశాలకు సభ్యుల ఆమోదం
ఈ తీవ్ర చర్చలు, నిరసనల అనంతరం, సమావేశంలో చర్చకు వచ్చిన 91 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. వీటిలో ముఖ్యంగా సీఐఐ భాగస్వామ్య సదస్సు–2025కు సంబంధించిన అంశాలున్నాయి. ఈ సందర్భంగా మేయర్ పీలా శ్రీనివాసరావు మాట్లాడుతూ రూ. 27.60 కోట్ల అంచనా వ్యయంతో నగర సుందరీకరణ, అభివృద్ధి పనులు, రూ. 5.3 కోట్ల అంచనా వ్యయంతో ఇతర ఇంజినీరింగ్ పనులకు సభ్యులు ఆమోదం తెలిపారని చెప్పారు. ప్రజా ఆరోగ్య విభాగానికి సంబంధించి పారిశుధ్య కార్మికుల జీతాలకు కూడా ఆమోదం లభించిందని తెలిపారు. సమావేశంలో ప్రధాన ఇంజినీర్ పీవీవీ సత్యనారాయణరాజు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్ కుమార్, జోన్–1 జోనల్ కమిషనర్ ఇప్పినాయుడు, 6వ జోన్ జోనల్ కమిషనర్ విజయశంకర్, పర్యవేక్షక ఇంజినీర్లు సంపత్‌కుమార్, రాయల్‌బాబు, గోవిందరావు, కె.శ్రీనివాసరావు, కార్యనిర్వాహక ఇంజినీర్లు, ఏఎంవోహెచ్‌లు ఇతర అధికారులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ సభ్యురాలి ఆగ్రహం
సమావేశం ప్రారంభానికి ముందు వైఎస్సార్ సీపీ సభ్యురాలు సాడి పద్మారెడ్డి కూడా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, ముఖ్యంగా సెక్రటరీ మేయర్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని, స్థాయీ సంఘం సమావేశాల విధివిధానాలు ఏమిటో తెలియజేయాలని ఆమె డిమాండ్ చేశారు. సమావేశం ఉందని సోమవారం ఉదయం తనకు ఫోన్ చేసి చెప్పారని, అజెండా అంశాలు చదవడానికి కూడా సమయం ఇవ్వలేదని ఆమె అన్నారు. గత సమావేశంలో అడిగినా ఇప్పటివరకు విధివిధానాలు తనకు ఇవ్వలేదని ఆరోపించారు. తమ వార్డులు, జోన్లలో చేపట్టే ఏ కార్యక్రమమైనా తన దృష్టికి తీసుకురావాలని అధికారులను కోరారు.
‘స్థాయీ సంఘం’లో రచ్చ రచ్చ
మేయర్‌పై గుర్రుమన్న కూటమి భాగస్వామి బీజేపీ కార్పొరేటర్ పర్సనల్‌గా మాట్లాడుకుందామన్న మేయర్ శ్రీనివాసరావు మీతో మాకు పర్సనల్ ఏంటి? అని నిలదీసిన వైనం సొంత సభ్యులనుంచేమేయర్‌కు చుక్కెదురు
విలీన గ్రామాలకు అన్యాయం?
మరో సభ్యుడు మొల్లి ముత్యాలు జీవీఎంసీ పరిధిలోని విలీన గ్రామాల అభివృద్ధిపై ప్రశ్నలు లేవనెత్తారు. ’జీవీఎంసీ అంటే కేవలం నగరం మాత్రమే కాదు, విలీన గ్రామాలూ ఉన్నాయి. కేవలం నగరంలోనే సుందరీకరణ, అభివృద్ధి పనులు చేపడితే విలీన గ్రామాలను ఎందుకు కలుపుకున్నట్లు? అని ఆయన ప్రశ్నించారు. శ్మశాన వాటికలకు కూడా రక్షణ లేకుండా పోయిందని, అభివృద్ధి పనులు అడిగితే బడ్జెట్ లేదని అధికారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నవంబర్‌లో జరిగే సదస్సుకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడానికి మాత్రం బడ్జెట్ ఉంటుందా అని ఆయన దుయ్యబట్టారు.