
కూటమి దసరా దందా
వివిధ విభాగాల సిబ్బందితో కలిసి పండగ మామూళ్ల వసూళ్లు
కూటమి చోటా నేతల దిగజారుడు వైఖరి
ఈపీడీసీఎల్, కమర్షియల్ ట్యాక్స్, జీవీఎంసీ సిబ్బందితో కలిసి వసూళ్లకు తెర
పెద్ద దుకాణాలు, షాపింగ్ మాల్స్ టార్గెట్
ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు
పశ్చిమ, దక్షిణ, పెందుర్తి నియోజకవర్గాల్లో వసూళ్ల పర్వం
సాక్షి, విశాఖపట్నం:
‘ఏదయా మీదయా.. మా మీద లేదు... ఇంత సేపుంచుట ఇది మీకు తగునా.. దసరాకి వస్తిమని విసవిసలు పడక...’ అంటూ గురువులు, పిల్లలు గతంలో వీధుల్లో దసరాపాటలు పాడుతూ తిరగేవారు.
ఇప్పుడు కాలం మారింది. కూటమి ప్రభుత్వం వచ్చింది. బడా నేతల అండదండలతో అధికార పార్టీకి చెంది చోటా మోటా నేతలు దసరా వస్తున్న సమయంలో పాటలు కాదు.. దందాటలు చేస్తున్నారు.
‘ఏదయా.. మాకు దసరా మామూళ్లు ఏదయా.. వచ్చిన వెంటనే ఇచ్చుట మీకు మర్యాద.. లేదంటే ఉంటాయి తదుపరి చర్యలయా..!’’ అంటూ పేట్రేగిపోతున్నారు. కనిపించిన దుకాణం, వ్యాపారి దగ్గరికి వెళ్లి దసరా మామూళ్లపేరుతో దందా చేస్తున్నారు. నగరంలోని పలు నియోజకవర్గాల్లో ఈ దందా జోరుగా సాగుతోంది. ఎమ్మెల్యే అనుచరులమని చెబితే.. కొందరు ఇవ్వరేమోనని.. పలు ప్రభుత్వ విభాగాల సిబ్బంది సహకారం తీసుకుంటున్నారు.
ఆ మూడు నియోజకవర్గాల్లో..
టీడీపీ, జనసేన, బీజేపీ.. అని తేడా లేకుండా.. ఎమ్మెల్యేల అనుచరులమంటూ మార్కెట్‌లో కొందరు చోటా మోటా నేతలు పండగ పేరుతో హల్ చల్ చేస్తున్నారు. ముఖ్యంగా తమ నియోజకవర్గాల పరిధిలోని ప్రధాన వాణిజ్య సముదాయాలు, వ్యాపారులు, మార్కెట్‌లు, రియల్ ఎస్టేట్ సంస్థలని టార్గెట్ చేశారు. ఎమ్మెల్యే అనుచరులమని, దసరా మామూళ్లు ఇవ్వాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. వ్యాపారం జరిగే ప్రాంతాన్ని బట్టి.. రూ.1000 నుంచి మొదలు పెట్టి రూ.10 వేలు, రూ.20 వేలు కూడా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తమకు నచ్చినట్లు ఇస్తామంటూ కుదరదంటూ.. ముందుగానే వ్యాపారి, లేదా వ్యాపార సంస్థ పేరు రాసి.. దానిపక్కన.. తాము అనుకున్న అమౌంట్ వేసి.. అంతే ఇవ్వాలని ఆదేశిస్తున్నారంట. విశాఖ దక్షిణం, పెందుర్తి, పశ్చిమ నియోజకవర్గాల్లో ఎక్కువగా ఈ తరహా వసూళ్లు జరుగుతున్నాయని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తరంలోనూ ఒకరిద్దరు కషాయం నేతలు కూడా దేవుడి పేరుతో దందాకు దిగినట్లు తెలుస్తోంది.
ఆయా విభాగాల సిబ్బందితో కలిసి..
కొందరు వ్యాపారులు తమ మాటని లెక్క చెయ్యరని తెలుసుకున్న కూటమి ఎమ్మెల్యేల అనుచరులు.. వివిధ ప్రభుత్వ విభాగాల సిబ్బందితో కలిసి ఈ అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం. ముఖ్యంగా ఏపీఈపీడీసీఎల్, జీవీఎంసీ, వాణిజ్య పన్నుల శాఖకు చెందిన ఆయా నియోజకవర్గాల్లో విధులు నిర్వర్తిస్తున్న దిగువస్థాయి సిబ్బంది కొందర్ని వీరి వెంట తీసుకెళ్తున్నారని తెలుస్తోంది. జీవీఎంసీ వాటర్‌సప్లై, టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ సిబ్బంది, ఈపీడీసీఎల్ లైన్‌ఇన్‌స్పెక్టర్లు, కొన్ని చోట్ల ఏఈఈలు ఇలా వీరిని పక్కన పెట్టుకొని చోటా నేతలు దసరా దందాలు చేస్తున్నట్లు సమాచారం. పైగా ఎమ్మెల్యేపేరు చెప్పి చేస్తుండటంతో ఎవ్వరూ ఏమీ అనకుండా చోటా నేతలు ఎంత చెబితే అంత చేతిలో పెట్టి పంపించేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారం ఎమ్మెల్యేలకు తెలీకుండా జరగదని ఎంతోకొంత ప్రమేయం ఉంటుందని వ్యాపారులు వాపోతున్నారు. మొత్తానికి కూటమి నేతలు కబ్జాల పర్వమే కాకుండా దసరా మామూళ్ల పర్వానికి కూడా దిగజారిపోవడం కొసమెరుపు.