
ఏడు రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం
సింహాచలం: భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సిద్ధమయ్యేనాటికి కనెక్టింగ్ మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో 174.64 కోట్లతో ఏడు రోడ్లు విస్తరణ, నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అడవివరంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమవుతుందని, దానికి అనుసంధానంగా ఈ మాస్టర్ ప్లాన్ రోడ్లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రోడ్ల నిర్మాణంలో దివీస్ ఫార్మా, లాన్‌సమ్ వంటి ప్రైవేట్ కంపెనీలు కూడా ఆర్థిక సహకారం అందించడం శుభపరిణామన్నారు. వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, కమిషనర్ విశ్వనాథన్ మాట్లాడుతూ రోడ్ల నిర్మాణాలను ఏప్రిల్ లేదా మే నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. వీఎంఆర్డీఏ చీఫ్ ఇంజనీర్ వినయ్‌కుమార్, ఎస్‌ఈ మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.
నిర్మించనున్న ప్రధాన రహదారులివే..: అడవివరం– గండిగుండం (8 కి.మీ), చిప్పాడ–పోలిపల్లి (6.32 కి.మీ), నేరెళ్లవలస–తాళ్లవలస (4 కి.మీ), బోయపాలెం–కాపులుప్పాడ (3.10 కి.మీ), గంభీరం రహదారి (2.20 కి.మీ), గంభీరం–పరదేశిపాలెం(1.40 కి.మీ),శివశక్తి నగర్ రహదారి (1.70 కి.మీ)