
ఆటపాటలతో అదుర్స్
ఏయూక్యాంపస్: నిత్యం తెల్లని యూనిఫాంలో కనిపించే నర్సింగ్ విద్యార్థులు ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్లో జరిగిన 31వ ఎస్‌ఎన్‌ఏఐ ద్వివార్షిక రాష్ట్ర స్థాయి సదస్సులో సందడి చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు పుస్తకాలకు, ప్రాక్టికల్స్‌కు కాస్త విరామం ఇచ్చి, రంగురంగుల దుస్తుల్లో ఆట పాటలతో, సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు.‘లెర్నింగ్ టుడే, లీడింగ్ టుమారో – జర్నీ ఆఫ్ ఏ నర్సింగ్ స్టూడెంట్’ అనే ఇతివృత్తంతో జరిగిన ఈ రెండు రోజుల కార్యక్రమంలో నర్సింగ్ విద్యార్థినులు ఆసక్తిగా పాల్గొన్నారు.
టీఎన్‌ఏఐ ఏపీ శాఖ అధ్యక్షురాలు డాక్టర్ సి.ఆర్. సంషీర్ బేగం మాట్లాడుతూ విద్యార్థుల భాగస్వామ్యం, సమన్వయం సదస్సును విజయవంతం అయిందని, వారి సహజ నైపుణ్యాల ప్రదర్శన అభినందనీయమని కొనియాడారు. సంస్థ కార్యదర్శి, ఏపీ ఎన్‌ఎంసీ రిజిస్ట్రార్ ఆచార్య కె. సుశీల మాట్లాడుతూ, నిత్యం చదువులతో గడిపే నర్సింగ్ విద్యార్థులకు ఈ క్రీడలు, సాంస్కృతిక పోటీలు మంచి ఆటవిడుపునిచ్చాయన్నారు. క్రీడా స్ఫూర్తితో పాల్గొన్న యువత భవిష్యత్ తరాల నాయకత్వానికి వారసులుగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో మిస్ నర్సింగ్ విజేతగా ఎస్తేర్ ఎం. డేవిస్, మిస్టర్ నర్సింగ్ విజేతగా జిబిన్ బిజు నిలిచారు.రంగోలీ, పేపర్ ప్రజెంటేషన్, ఏకపాత్రాభినయం, బృంద నృత్యాలు, శాసీ్త్రయ నృత్యాలు, క్రీడల పోటీల విజేతలకు బహుమతులను, జ్ఞాపికలను ప్రదానం చేశారు.టిఎన్‌ఏఐ ఏపీ సలహాదారు డాక్టర్ సత్యవల్లి అసోసియేషన్ తరపున అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ సభ్యులు కె. ఝాన్సీ లక్ష్మీభాయి, డి. ఉష పన్నగ వేణి, డాక్టర్ టి. అన్నమ్మ, ఆచార్య బి. అనంతమ్మ, కె.వి శ్రీదేవి, జె. లీల, ప్రెస్ అండ్ పబ్లిసిటీ చైర్ పర్సన్ ప్రీతం లూక్స్, కో చైర్ పర్సన్ చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ముగిసిన నర్సింగ్
విద్యార్థులు సమ్మేళనం

ఆటపాటలతో అదుర్స్