
ఏఐ సాయంతో ట్రాఫిక్ నియంత్రణ
మహారాణిపేట: పర్యాటకంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో ట్రాఫిక్ నియంత్రణ, నిర్వహణను సులభతరం చేయడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరిష్కారం అవసరమని ఎంపీ ఎం. శ్రీభరత్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను అనుసరించడం ద్వారా ట్రాఫిక్ సమస్యలు తగ్గి, నిర్వహణ సులభమవుతుందని ఆయన పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో ట్రాఫిక్ నియంత్రణ, నిర్వహణ, నిబంధనల ఉల్లంఘన, అపరాధ రుసుం వంటి అంశాలపై జీవీఎంసీ అధికారులు, వివిధ సాంకేతిక సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఎంపీ శ్రీభరత్ మాట్లాడారు. సమావేశంలో ఎంపీ శ్రీభరత్‌తో పాటు కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్, పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చి పాల్గొని తమ అభిప్రాయాలు, సూచనలు అందించారు. బృహస్పతి, అవిరోస్, ఆర్కడిస్, నయన్ వంటి సాంకేతిక సంస్థల ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చారు. హైదరాబాద్, బెంగళూరు, ఇండోర్, లక్నో, ఢిల్లీ వంటి నగరాల్లో అమలు చేస్తున్న సాంకేతిక విధానాలను వివరించారు. సాంకేతికత సహాయంతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం, నిబంధనలు ఉల్లంఘించిన ఘటనలను నమోదు చేయడంపై ఇటీవల చేపట్టిన పైలట్ ప్రాజెక్టు నమూనాలను ప్రదర్శించారు. ఎయిర్ పోర్టు రోడ్డు, ఆర్కే బీచ్, బిర్లా జంక్షన్, పంజాబీ హోటల్, ఆర్ అండ్ బీ జంక్షన్లలో సేకరించిన నమూనాలను చూపించారు. భవిష్యత్తు ట్రాఫిక్ సమస్య, సిగ్నలింగ్ వ్యవస్థ అనుసంధానం, డ్యాష్ బోర్డు నిర్వహణ, వేగ నియంత్రణ, ట్రాఫిక్ అలర్ట్స్, పార్కింగ్ రూల్స్ వంటి అంశాలపై ప్రజెంటేషన్ చేశారు. విశాఖకు తగిన విధంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని, ప్రజల అవసరాలకు తగ్గట్టు సరైన పరిష్కార మార్గాలను చూపే సంస్థ సేవలను వినియోగించుకోవడానికి విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని ఎంపీ శ్రీభరత్ తెలిపారు. అక్టోబర్ తొలి వారంలో జీవీఎంసీ నుంచి ఆర్.ఎఫ్.పి. సిద్ధం చేసి సాంకేతిక సంస్థలకు పంపించాలని అధికారులను ఆదేశించారు. అన్ని రకాల సాంకేతిక ప్రక్రియలు పూర్తి చేసి, అక్టోబర్ చివరి నాటికి టెండర్లను పిలవాలని జీవీఎంసీ అధికారులకు ఎంపీ సూచించారు.
భవిష్యత్తు కార్యాచరణపై కలెక్టర్, సీపీలతో ఎంపీ శ్రీభరత్ సమీక్ష