
బాలకృష్ణ వ్యాఖ్యలు సరికావు
సాక్షి, విశాఖపట్నం: ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడిన తీరుపై వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బాలకృష్ణ ప్రవర్తన ‘మానసిక అస్థిరత్వానికి నిదర్శనం’గా అభివర్ణించారు. గురువారం మీడియా సమావేశంలో మాట్లాడిన కేకే రాజు, అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురించి బాలకృష్ణ మాట్లాడిన భాష, ప్రవర్తనపై తీవ్ర విమర్శలు చేశారు. శాసనసభలో సభా సంప్రదాయాలను పాటించకుండా, సినిమా షూటింగ్‌లో ఉన్నట్లుగా నెత్తిమీద కళ్లజోడు పెట్టుకుని, జేబుల్లో చేతులు పెట్టుకుని మాట్లాడి అసెంబ్లీ గౌరవాన్ని బాలకృష్ణ దెబ్బతీశారని ఆరోపించారు. అధికారం ఉందనే అహంకారంతో ఇష్టానుసారంగా మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కేకే రాజు హెచ్చరించారు. బాలకృష్ణ పిచ్చి చేష్టలు, మాట్లాడే తీరును గమనిస్తే దాన్నే ‘సైకో ఇజం’ అంటారన్నారు. బాలకృష్ణ మాట్లాడుతున్నప్పుడు స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి ‘వెరీగుడ్’ అనడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలపై బాలకృష్ణ తక్షణమే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీలో చిరంజీవిపై బాలకృష్ణ ‘వాడు’, ‘వీడు’ అని మాట్లాడటాన్ని ప్రస్తావిస్తూ, ఇది చిరంజీవిపై ఆయనకున్న అసూయను వెళ్లగక్కడమేనని కేకే రాజు ఆరోపించారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు