‘మహా’ విస్తరణ | - | Sakshi
Sakshi News home page

‘మహా’ విస్తరణ

Sep 25 2025 7:01 AM | Updated on Sep 25 2025 7:01 AM

‘మహా’ విస్తరణ

‘మహా’ విస్తరణ

● జోన్ల వికేంద్రీకరణపై దృష్టి ● 8 నుంచి 10 జోన్లకు పెంపు ● కొత్తగా భీమిలి, గోపాలపట్నం జోన్లు ● రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌?

డాబాగార్డెన్స్‌: నగర జనాభా పెరుగుదల, సమీప గ్రామీణ ప్రాంతాల విలీనంతో ఒకప్పటి విశాఖ మున్సిపాలిటీ కార్పొరేషన్‌ అయ్యింది. కార్పొరేషన్‌ గ్రేటర్‌గా మారింది. 32 గ్రామాల విలీనంతో 72 వార్డులున్న జీవీఎంసీ 98 వార్డులు, 8 జోన్లకు చేరింది. ఇప్పుడు గ్రేటర్‌ కార్పొరేషన్‌ మరో అడుగు ముందుకేస్తోంది. కొన్ని గ్రామీణ ప్రాంతాల విలీనంతోపాటు, 8 జోన్లను కాస్తా.. 10 జోన్లుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపినట్లు తెలిసింది.

పరిధి పెరగనుంది

గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధి మరింత విస్తరించనుంది. కొత్త విశాఖ జిల్లాలో కొన్ని గ్రామీణ ప్రాంతాలు జీవీఎంసీలోకి వచ్చే అవకాశముంది. విశాఖ మొత్తాన్ని జీవీఎంసీ పరిధిలోకి తీసుకురావాలని పాలకవర్గం భావిస్తోంది. దీంతో జీవీఎంసీ విస్తీర్ణం పెరుగుతుండడంతో కొత్త జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ ప్రతిపాదనను కౌన్సిల్‌లో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారు. దీనికి ప్రభుత్వం కూడా ఆమోద ముద్ర వేసినట్టు సమాచారం.

10 జోన్లకు పెంపు

జీవీఎంసీ విస్తీర్ణం పెరిగితే పరిపాలన, ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన కష్టతరంగా మారుతుంది. ఈ సమస్య ఉత్పన్నం కాకుండా ఉండేందుకు జోన్ల సంఖ్యను పెంచాలని పాలకవర్గం భావించింది. ప్రస్తుతం జీవీఎంసీ పరిధిలో 8 జోన్లు ఉన్నాయి. ఒక్కో జోన్‌ పరిధి రెండు, మూడు నియోజకవర్గాలకు విస్తరించి ఉన్నాయి. అటువంటి పరిస్థితి లేకుండా ఉండేందుకు ఇప్పుడు ఒక్కో నియోజకవర్గం పరిధిలో ఒక జోన్‌ మాత్రమే ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జోన్ల వికేంద్రీకరణ పూర్తి చేశారు. ఒక నియోజకవర్గంలో ఉన్న వార్డులన్నీ ఒకే జోన్‌ పరిధిలోకి రానున్నాయి. అలాగే ఇప్పటి జోన్లుగా పిలిచే ఈ కార్యాలయాలు ఇకపై నియోజకవర్గ పేర్లతో ఏర్పాటు కానున్నాయి. దీని ప్రకారం విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, పెందుర్తి, గాజువాక, భీమిలి, అనకాపల్లి పేర్లతో జోన్లు ఏర్పాటు కానున్నాయి. వీటితో పాటు కొత్తగా మరో రెండు జోన్లు ఏర్పాటు చేయనున్నారు. పెందుర్తిలో గ్రామీణ ప్రాంతాలు కలిస్తే పరిధి పెరుగుతుంది. దీంతో గోపాలపట్నం జోన్‌ కొత్తగా రానుంది. అలాగే ఆనందపురం, పద్మనాభం మండలాలు కలిస్తే ప్రస్తుతమున్న మధురవాడ జోన్‌ పరిధి భారీగా పెరగనుంది. దీంతో కొత్తగా భీమిలి జోన్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 8 జోన్లు 10కి పెరగనున్నాయని సమాచారం. ఇప్పటికే ఈ ప్రతిపాదనలను పాలకవర్గం ప్రభుత్వానికి పంపింది. దీనిపై ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించింది. ఈ జోన్ల పెంపునకు ప్రభుత్వం కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే తుది ప్రక్రియకు కసరత్తు జరగనున్నట్లు జీవీఎంసీలో చర్చ జరుగుతోంది.

పరిపాలన సౌలభ్యం.. పారదర్శకత

జీవీఎంసీ పరిపాలనలో అనూహ్య మార్పులు రానున్నాయి. పరిపాలన సౌలభ్యం, పారదర్శకతలో భాగంగా ఈ ప్రక్రియను గత కౌన్సిల్‌ సమావేశంలో శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు ఒక్కో జోన్‌ పరిధిలో 8 నుంచి 15 వార్డులు వరకు ఉన్నాయి. ఒక జోన్‌ పరిధిలో రెండు, మూడు నియోజకవర్గాలకు సంబంధించి ప్రాంతాలున్నాయి. దీంతో పరిపాలన సక్రమంగా ఉండడం లేదని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దీన్ని మార్చాలని దీర్ఘకాలిక డిమాండ్‌ ఉంది. ఒక్కో నియోజకవర్గాన్ని ఒక జోన్‌గా చేయడం ద్వారా పరిపాలన సులభతరం అవుతుందని భావిస్తున్నారు.

జీవీఎంసీలోకి మండలాలు..

ఉమ్మడి విశాఖ విభజన తర్వాత విశాఖ జిల్లాగా మారాక పద్మనాభం, ఆనందపురం, పెందుర్తిలో కొన్ని గ్రామాలు జీవీఎంసీకి దూరంగానే ఉన్నాయి. దీంతో ఆయా మండలాలకు జిల్లా పరిషత్‌ ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. తాజాగా మొత్తం విశాఖ జిల్లా అంతటినీ జీవీఎంసీ పరిధిలోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబును ప్రజా ప్రతినిధులు విశాఖ పర్యటనలో కోరారు. ఎమ్మెల్యేల ప్రతిపాదనలను పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ హరేందిరప్రసాద్‌ను సీఎం ఆదేశించారు. దీంతో ప్రస్తుతం మండలాలుగా ఉన్న ఆనందపురం, పద్మనాభం ప్రాంతాలను కూడా జీవీఎంసీ పరిధిలోకి తీసుకురావాలని భావిస్తున్నారు. అలాగే పెందుర్తిలో కొంత మేర జీవీఎంసీలో ఉన్నప్పటికీ మెజార్టీ విస్తీర్ణంలో ఇంకా అనేక గ్రామాలున్నాయి. వీటిని కూడా జీవీఎంసీ పరిధిలోకి తీసుకురానున్నారు. దీంతో జీవీఎంసీ విస్తీర్ణం భారీగా పెరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement