
సంగం–శరత్‌లో ఓజీ గోల
సీతంపేట: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా నగరంలోని సంగం శరత్ థియేటర్ అద్దాలను ఫ్యాన్స్ పగులగొట్టారు. బుధవారం రాత్రి 10 గంటల షో టిక్కెట్ల కోసం సాయంత్రం 6 గంటలకే పవన్ ఫ్యాన్స్ థియేటర్ వద్దకు భారీగా చేరుకున్నారు. అరుపులు, కేకలతో హోరెత్తించారు. ఫ్యాన్స్ భారీగా థియేటర్‌కు చేరుకోవడంతో ఎలాంటి సంఘటనలు జరగకుండా నియంత్రించేందుకు ఫోర్త్‌టౌన్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఫ్యాన్స్ అల్లరి శృతిమించింది. కేకలు, నినాదాలతో రెచ్చిపోయారు. హాల్లోకి వెళ్లేటపుడు తోపులాట జరగడంతో థియేటర్ ప్రవేశ ద్వారం వద్ద గ్లాస్ డోర్ విరిగిపోయింది. టిక్కెట్లు దొరకని వారు థియేటర్ అద్దాలు పగులగొట్టారు. ఆఖరుకు పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి తోపులాటను నియంత్రించి, టికెట్లున్నవారిని థియేటర్ లోపలకు పంపించారు.