
అందరికీ అందుబాటులో ప్రజా సేవలు
విశాఖ లీగల్: ప్రభుత్వం అందించే అన్ని సేవలు ప్రజలకు సత్వరమే చేరేలా చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా శాశ్వత ప్రజా న్యాయ పీఠం అధ్యక్షుడు జస్టిస్ జి.వల్లభనాయుడు సూచించారు. విశాఖ జిల్లా న్యాయ సేవ ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రజా ప్రయోజనాలను ప్రజలందరికీ సత్వరమే చేరేలా పలు సంస్థలతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో న్యాయ సేవ ప్రాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఆర్ సన్యాసినాయుడు, విద్యుత్, టెలికాం, రవాణా, తపాలా, గ్రామీణ ఉపాధి పథకం, గ్రామీణ అభివృద్ధి శాఖ తదితర విభాగాల నుంచి అధికారులు పాల్గొన్నారు. అర్హులైన ప్రజలకు ప్రభుత్వ సేవలు అందకపోతే వారు న్యాయ సేవా ప్రాధికార సంస్థను ఆశ్రయించవచ్చని న్యాయమూర్తి వల్లభనాయుడు స్పష్టం చేశారు. లోక్ అదాలత్ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు మాట్లాడుతూ ప్రయా ప్రయోజన సేవలన్నీ ప్రజలకు సత్వరమే అందేలా అధికారులు స్పందించాలని, లేనిపక్షంలో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని సూచించారు. కార్యక్రమంలో వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.