
నిరంతర నైపుణ్యాల పెంపుతో వృత్తిలో రాణింపు
ఏయూక్యాంపస్: నైపుణ్యాలతో మెరుగైన అవకాశాలు లభిస్తాయని విశాఖ పార్లమెంట్ సభ్యుడు ఎం.శ్రీభరత్ అన్నారు. బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా 31వ ఎన్‌ఎన్‌ఏఐ ద్వైవార్షిక రాష్ట్ర సదస్సు–2025ను బుధవారం ఆయన ప్రారంభించారు. ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏపీ ప్రాంతీయ శాఖ ‘లెర్నింగ్ టుడే, లీడింగ్ టుమారో, ద జర్నీ ఆఫ్ ఏ నర్సింగ్ స్టూడెంట్’అనే అంశంపై ఈ సదస్సు నిర్వహిస్తోంది. ముందుగా ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నిరంతరం నైపుణ్యాలను పెంచుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. విదేశాల్లో సైతం నర్సింగ్ విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా సదస్సు సావనీర్‌ను ఆవిష్కరించారు.
ఇండియన్ రెసిటేషన్ ఫెడరేషన్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ఎస్‌ఎస్‌సీ చక్రరావు మాట్లాడుతూ ప్రజలకు వ్యాధుల పట్ల అవగాహన కల్పించడంలో, సార్వత్రిక రోగ నిరోధకత కార్యక్రమంలో నర్సింగ్ సిబ్బంది పాత్ర కీలకమన్నారు. ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షురాలు(సౌత్) డాక్టర్ బి.వల్లి మాట్లాడుతూ నిరంతరం నేర్చుకోవాలనే తపనతోనే వృత్తిలో అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. టీఎన్‌ఏఐ ఏపీ శాఖ అధ్యక్షురాలు సీఆర్ సంషీర్ బేగం, టీఎన్‌ఏఐ ఏపీ శాఖ కార్యదర్శి, ఏపీ ఎన్‌ఎంసీ రిజిస్ట్రార్ ఆచార్య కె.సుశీల మాట్లాడుతూ నాయకత్వ లక్షణాలను మెరుగుపరచుకుంటూ, సమష్టిగా పనిచేయడం అలవాటు చేసుకోవాలన్నారు. ఏపీ నర్సింగ్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ ఆచార్య ఎస్.జ్యోతి మాట్లాడుతూ ప్రత్యక్ష జ్ఞానాన్ని, సామర్థ్యాలను పెంచుకోవడానికి నర్సింగ్‌లో ఉన్నత విద్యను అభ్యసించాలన్నారు. సంస్థ సలహాదారు డాక్టర్ ఎం.సత్యవల్లి, ప్రెస్ అండ్ పబ్లిసిటీ చైర్‌పర్సన్ ప్రీతం లూక్స్, కో చైర్‌పర్సన్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు రంగోలి, క్రీడలు, పేపర్ ప్రజెంటేషన్, సాంస్కృతిక పోటీలతో ఆకట్టుకున్నారు.
రెండు రోజుల నర్సింగ్ విద్యార్థుల
రాష్ట్ర సదస్సు ప్రారంభం