
అన్ని రంగాల్లో ఉత్తమంగా జిల్లా
మహారాణిపేట: జిల్లాను అన్ని రంగాల్లో ఉత్తమంగా నిలిపేందుకు అధికారులు నూతన ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ హరేందిర ప్రసాద్ సూచించారు. బుధవారం శాఖల వారీగా అధికారులతో జిల్లా అభివృద్ధి, ఆర్థిక పరిపుష్టి, ఆదాయ మార్గాల సాధనకు, సంక్షేమ కార్యక్రమాల అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ చర్చించారు. రైతు సేవా కేంద్రాల స్థాయి నుంచి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, పశుసంవర్ధకంలో డీఆర్డీఏ సహకారంతో కొత్త యూనిట్ల స్థాపన, ఉద్యానవన పంటల విస్తీర్ణం పెంపు, మత్స్య రంగంలో ఉత్పాదకత పెంచడంపై దృష్టి పెట్టాలన్నారు. టూరిస్ట్ డెస్టినేషన్ విశాఖలో పర్యాటకులు రెండు మూడు రోజులు గడిపేలా అడ్వెంచర్ టూరిజం స్పాట్‌లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్ కోసం శిక్షణ ఇవ్వడానికి విశాఖ ఐఏఎం ముందుకొచ్చిందని, స్థానిక ఔత్సాహికులను గుర్తించి శిక్షణ ఇప్పించాలన్నారు. జిల్లాలో 1,05,000 మంది బంగారు కుటుంబాలను గుర్తించామని, 64 వేల మందిని దత్తత ఇచ్చామని, ఆ కుటుంబాల అవసరాలు తీరేలా చూడాలన్నారు. విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతంలో పక్షులు ఎగరకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డోర్ టు డోర్ చెత్త సేకరణ, వీధిలైట్ల మరమ్మతులు, రోడ్లపై ఎక్కడా గుంతలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జీఎస్టీ 2.0 సంస్కరణ ఫలితాలు ప్రజలకు తెలిసేలా నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
నేడు గంట పాటు శ్రమదానం
స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా ఏక్ దిన్.. ఏక్ ఘంటా.. ఏక్ సాత్ పేరిట అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గురువారం ఉదయం 8 నుంచి 9 గంటల వరకు శ్రమదాన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. డీఆర్‌వో భవానీ శంకర్, జిల్లా అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.