
రక్షణ రంగంలో స్వావలంబన దిశగా భారత్
కొమ్మాది: భారతదేశం రక్షణ రంగంలో స్వావలంబన దిశగా ముందుకు సాగుతోందని విధాన నిర్ణేతలు, సైనిక నాయకులు, పరిశ్రమ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. బీచ్ రోడ్డులోని రాడిసన్ బ్లూ రిసార్ట్‌లో బుధవారం జరిగిన స్వరక్ష మహోత్సవ్–2025 కార్యక్రమంలో వీరు సమావేశమయ్యారు. దేశ భద్రత విషయంలో వేగవంతంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మెరుగైన ట్రాఫిక్ నిర్వహణ నుంచి మానవ రహిత సముద్ర వ్యవస్థ, పట్టణ నిఘా కోసం డ్రోన్‌ల వరకు తీసుకుంటున్న చర్యలు, జాగ్రత్తల గురించి మాట్లాడారు. రక్షణ వ్యవస్థలో ప్రవేశపెడుతున్న మార్పులు, ఆధునిక విధానాలు, వాటివల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. కోస్ట్‌గార్డ్ విస్తరణ, పనితీరు, ప్రైవేటు పరిశ్రమల ద్వారా వచ్చే అవకాశాలపై చర్చించారు. ముఖ్యంగా షిప్‌యార్డులు ప్రపంచ స్థాయిలో పోటీపడాలని, సైబర్ భద్రత విషయంలో ప్రత్యేక దృష్టితో చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా 40 మంది ప్రదర్శనకారులు అత్యాధునిక రక్షణ, అంతరిక్షం, జియోస్పేషియల్ మొదలైన వాటి సాంకేతికల గురించి ప్రదర్శించారు. కార్యక్రమంలో ఇండియన్ కోస్ట్‌గార్డ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ మనీష్‌వర్మ, తూర్పు నేవల్ కమాండ్ చీఫ్ స్టాఫ్ అధికారి(ఆపరేషన్స్) అడ్మిరల్ శంతను, హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కమోడోర్ గిరిదీప్ సింగ్, చైర్మన్ సాజిద్ ముక్తార్, ఎక్స్‌ఈ లింక్స్ స్పేస్ ల్యాబ్స్ సీఈవో రూపేష్ కుండపల్లి, విశాఖ ఎంపీ శ్రీభరత్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి పాల్గొన్నారు.