
యువత భవిష్యత్ నాయకులుగా ఎదగాలి
సీతంపేట: యువతలో నాయకత్వాన్ని పెంపొందించడానికి జాతీయ సేవా పథకం(ఎన్‌ఎస్‌ఎస్) ఎంతగానో దోహదపడుతుందని ఎన్‌ఎస్‌ఎస్ రాష్ట్ర అధికారి డాక్టర్ ఎం.సుధాకర్ అన్నారు. ఏయూ ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఎన్‌ఎస్‌ఎస్ డే–2025, విశ్వవిద్యాలయ స్థాయి యువజనోత్సవాల ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత భవిష్యత్ నాయకులుగా, బహుముఖ ప్రజ్ఞావంతులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఏయూ వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ మాట్లాడుతూ శతాబ్ది వేడుకల్లో భాగంగా ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. రెండు రోజులుగా విద్యార్థులు కళలు, మేధో పోటీల్లో తమ ప్రతిభను చాటారని తెలిపారు. యువతలో సృజనాత్మకత, సహజ నైపుణ్యాలు వెలికితీసి ఉన్నతంగా తిర్చిదిద్దుతామన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ సమన్వయకర్త డి.సింహాచలం అప్పటి వరకు జరిగిన కార్యక్రమాల వివరాలను సభకు వివరించారు.