
నౌకా నిర్మాణంలో తిరుగులేని శక్తిగా షిప్‌యార్డు
హెచ్‌ఎస్‌ఎల్ సీఎండీ గిరిదీప్ సింగ్
సాక్షి, విశాఖపట్నం: ఆత్మనిర్భర్ భారత్, మారీటైమ్ ఇండియా విజన్–2030 నాటికి భారత్‌లో నౌకా నిర్మాణంలో హిందుస్థాన్ షిప్‌యార్డు(హెచ్‌సీఎల్) తిరుగులేని శక్తిగా ఆవిష్కృతమవుతుందని సంస్థ సీఎండీ గిరిదీప్ సింగ్ అన్నారు. నగరంలో బుధవారం జరిగిన స్వరక్ష మహోత్సవ్–2025 సదస్సులో ఆయన మాట్లాడారు. రక్షణ రంగంలో ఎనిమిది దశాబ్దాలకు పైగా ఇండియన్ నేవీ, కోస్ట్‌గార్డ్, వాణిజ్య సంస్థలకు సేవలందిస్తున్న షిప్‌యార్డు.. ఇప్పటి వరకూ 200 నౌకల్ని డెలివరీ చేయగా, 2000 కంటే ఎక్కువ షిప్స్‌కు మరమ్మతులు, రీఫిట్ పనులు విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. దశాబ్దాలకు పైగా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు పోరాటం సాగించిన తర్వాత.. 2024–25లో అత్యధిక వృద్ధి రేటు, లాభాల్ని నమోదు చేసి.. మినీరత్న హోదాకు అర్హత పొందడం శుభపరిణామమన్నారు. దాదాపు రూ.20 వేల కోట్ల విలువైన ఆర్డర్లని పొందడం ద్వారా షిప్‌యార్డు మరింత అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోందని పేర్కొన్నారు. పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో ల్యాండ్‌మార్క్ ఫ్లీట్ సపోర్ట్ షిప్ ప్రొగ్రామ్, అధునాతన జలాంతర్గాముల నిర్మాణాలపై దృష్టి సారించామన్నారు. షిప్‌యార్డు ప్రయాణంలో ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్ సంస్థల సహకారం మరువలేనిదని సీఎండీ గిరిదీప్ సింగ్ తెలిపారు.