
అపర సంజీవని
మూగబోతున్న కుయ్.. కుయ్.. సేవలు
ప్రజాసేవకు దూరంగా 108 వాహనాలు
రోడ్డు ప్రమాదాల సమయాల్లో
ఆలస్యంగా వస్తున్న వైనం
తరచూ మరమ్మతులు, బ్రేక్ డౌన్లు
అవుతున్న వాహనాలు
అంపశయ్యపై..
మహారాణిపేట : రోడ్డు ప్రమాదాలు, తీవ్ర అనారోగ్యాలు, పురిటి నొప్పులు వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడే సంజీవనిగా పేరుగాంచిన 108 అంబులెన్స్ సేవలు ఇప్పుడు కష్టాల్లో కూరుకుపోయాయి. సకాలంలో అంబులెన్స్ అందుబాటులోకి రాకపోవడంతో రోగులు, క్షతగాత్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఫోన్ చేసిన 15 నిమిషాల్లోనే వచ్చే అంబులెన్స్‌లు ఇప్పుడు మరమ్మతులు కారణంగా ఆలస్యమవుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన ఈ సేవలు, ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వంలో కూడా సమస్యలు మరీ ఎక్కువయ్యాయి.
వైఎస్సార్ కలల పథకం 108
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి 2005లో 108 అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. ‘కుయ్... కుయ్’ అనే సైరన్ వినగానే వైఎస్సార్ గుర్తుకు వస్తారంటే అతిశయోక్తి కాదు. ఈ సేవలు వేలాది మంది ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించాయి.
వై.ఎస్. జగన్ హయాంలో బలోపేతం
2019లో అధికారంలోకి వచ్చిన వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి 108 వ్యవస్థను మరింత బలోపేతం చేశారు. ఒకేసారి 1,088 కొత్త అంబులెన్స్‌లను ప్రారంభించి, ప్రతి మండలానికి ఒక అంబులెన్స్ ఉండేలా చూశారు. పట్టణాల్లో 15 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాల్లో, గిరిజన ప్రాంతాల్లో 30 నిమిషాల్లో అంబులెన్స్ చేరేలా సమయపాలన నిర్ధారించారు. ప్రతి అంబులెన్స్‌ను ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్‌తో అనుసంధానం చేసి, ఫోన్ చేసిన వారిని వేగంగా ట్రాక్ చేసేలా అధునాతన సాంకేతికతను ఏర్పాటు చేశారు. ఈ అంబులెన్స్‌లలో కెమెరా, మొబైల్ డేటా టెర్మినల్, ఆటోమెటిక్ వెహికల్ లొకేషన్ టాండ్ బాక్స్ వంటి సౌకర్యాలు కల్పించారు.
కరోనా సమయంలో కీలక సేవలు
2020–21లో కరోనా మహమ్మారి సమయంలో, 108 అంబులెన్స్‌లు వేలాది మంది ప్రాణాలు కాపాడటంలో ప్రధాన పాత్ర పోషించాయి. అంతేకాకుండా, రోడ్డు ప్రమాద బాధితులు, గర్భిణులు, నవజాత శిశువులు, పాము కాటుకు గురైన వారు, విషప్రయోగం వంటి అనేక సందర్భాల్లో ఈ అంబులెన్సులు ప్రజలకు సేవలు అందించాయి.
కొత్త కాంట్రాక్టర్‌తో సమస్యలు
ఆంధ్రప్రదేశ్‌లో 2020 జూలై 1 నుంచి అరబిందో ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆధ్వర్యం లో నడిచిన 108 సేవలు, ఆ కాంట్రాక్ట్ గడువు మే 31తో ముగిసింది. జూన్ 1 నుంచి భవ్య హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఈ సేవలు కొనసాగుతున్నాయి. జిల్లాకు అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్ వ్యవస్థ కలిగిన 108 వాహనాలను కేటాయించారు. అయితే మరమ్మత్తులకు గురైన వాహనాలను సకాలంలో రిపేర్ చేయకపోవడంతో సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. ఈ అత్యవసర సేవలను మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
విశాఖలో 108 వాహనాలు
విశాఖలో 16 అంబులెన్స్‌లు ఉన్నాయి. ఇందులో అంబులెన్స్ రిజర్వు ఉంచుతారు. ఎదైనా మరమ్మతులకు గురైతే దాని స్థానంలో ఈ అంబులెన్స్ పంపుతారు.
సమస్య ఉంటే
తెలియజేయండి
పేద రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 108 వాహనాలను నడుపుతున్నాం. మొత్తం 16 వాహనాలు అందుబాటులో ఉన్నాయి. వాహనాలకు సంబంధించి ఏ సమస్య ఉన్నా రోగులకు తమకు తెలియజేయవచ్చు.
– ఎం.సురేష్, జిల్లా మేనేజర్.
సేవలలో జాప్యం
అత్యవసర పరిస్థితుల్లో పేదలకు ప్రాణదాత అయిన 108 అంబులెన్స్ సేవలు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. వాహనాలు తరచూ మరమ్మత్తులకు గురవుతుండటం, వాటిని సకాలంలో రిపేర్ చేయకపోవడంతో సేవల్లో జాప్యం జరుగుతోంది. ఫోన్ చేసిన చాలా సమయం తర్వాత కూడా అంబులెన్స్ అందుబాటులోకి రావడం లేదు. దీంతో రోడ్డు ప్రమాద బాధితులు, రోగులు ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. వాహనాలకు చిన్నపాటి రిపేర్లు వచ్చినా, వాటిని మరమ్మతులు చేయడానికి ఎక్కువ సమయం పడుతోంది. దీనివల్ల చాలా అంబులెన్స్‌లు సేవలకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. 108 సేవలు అందుబాటులో లేకపోవడంతో, పేదలు అత్యవసర పరిస్థితుల్లో ఆటోలు లేదా ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇది వారి జేబులకు చిల్లు పెడుతోంది. వర్షాల కారణంగా అంటువ్యాధులు పెరిగిన ఈ సమయంలో, ప్రజలు ఆస్పత్రులకు వెళ్లడానికి అంబులెన్సులు లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించి 108 సేవలను మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు.

అపర సంజీవని