
విశాఖలో సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిష
మద్దిలపాలెం: ఆంధ్రప్రదేశ్‌ను జాతీయ స్థాయిలో క్లీన్ ఎనర్జీ రంగంలో అగ్రగామిగా నిలపడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాగర్ నగర్‌లో రూ. 13.5 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆధునిక సూపర్ ఈసీబీసీ భవనాన్ని సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్‌గా మార్చాలని అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రాజెక్టును మొదట బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ నుంచి రూ. 5 కోట్ల గ్రాంట్‌తో ప్రారంభించారు. భవిష్యత్ ఖర్చులను ఏపీ డిస్కాంలు, ఏపీజెన్కో, ఏపీట్రాన్‌కోతో కలిసి భరించనున్నాయి. ఈ కేంద్రం కేవలం ఒక పరిశోధనా సంస్థగా మాత్రమే కాకుండా, విద్యుత్ రంగంలో ఇన్నోవేషన్, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లకు ఒక వేదికగా పనిచేయనుంది. ఇది ఒక రిజిస్టర్ సొసైటీగా ఏర్పాటై, పరిశ్రమలు, విద్యాసంస్థలు, థింక్ ట్యాంకులు కలిసి పనిచేయడానికి అవకాశం కల్పిస్తుంది.
పునరుత్పాదక శక్తి, స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీలు, ఈవీ చార్జింగ్, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాలపై పరిశోధనలు చేస్తుంది.ఇంజనీర్లు, టెక్నీషియన్లకు సర్టిఫికెట్ కోర్సులు, విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, ఫెలోషిప్‌లు అందిస్తుంది. స్టార్టప్‌లకు ఇంక్యుబేషన్, పరిశ్రమ నిపుణులతో మెంటార్‌షిప్, నిధుల సేకరణకు మద్దతు ఇస్తుంది. ఈ సొసైటీ జనరల్ బాడీకి చైర్మన్‌గా ఎనర్జీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తారు. ఈ కేంద్రం స్థాపనతో విశాఖ దేశవ్యాప్తంగా ‘క్లీన్ ఎనర్జీ ఇన్నోవేషన్ హబ్’గా గుర్తింపు పొందనుంది.