
గంజాయి రవాణా అడ్డుకట్టకు ఉమ్మడి వ్యూహం
సాక్షి, విశాఖపట్నం : ప్రాంతీయ భద్రత, శాంతిభద్రతలను పెంపొందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా పోలీసుల మధ్య జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అంతర్–రాష్ట్ర సమన్వయ సమావేశం జరిగింది. విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల సీనియర్ పోలీసు అధికారులు సరిహద్దు సమస్యలు, ముఖ్యంగా గంజాయి అక్రమ రవాణాపై చర్చించారు. గత కొన్నేళ్లుగా గంజాయి సాగు గణనీయంగా తగ్గిందని, 2021–22లో 7,515 ఎకరాల నుంచి 2024–25లో 93 ఎకరాలకు తగ్గిందని విశాఖ రేంజ్ పోలీసులు తెలిపారు. గంజాయి సాగు చేసే రైతులకు ప్రత్యామ్నాయ పంటలు ప్రోత్సహించడానికి చేపట్టిన చర్యలను వివరించారు. ఈ ఏడాది గంజాయి అక్రమ రవాణాలో 377 కేసులు నమోదు చేసి, 22,207 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇరు రాష్ట్రాల మధ్య నిరంతర సహకారం, సమాచార మార్పిడిని కొనసాగించాలని సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో కోరాపుట్ సౌత్ వెస్టర్న్ రేంజ్ డీఐజీ కన్వర్ విశాల్ సింగ్, రాయగడ ఎస్పీ ఎం. స్వాతి ఎస్ కుమార్, కోరాపుట్ ఎస్పీ రోహిత్ వర్మ, మల్కాన్‌గిరి ఎస్పీ హెచ్. వినోద్ పాటిల్, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి పాల్గొన్నారు.