
నేడు జోనల్ కార్యాలయాల వద్ద ధర్నాలు
డాబాగార్డెన్స్: తోపుడు బండ్లు, వీధి విక్రయదారులపై వెంటనే దాడులు ఆపాలంటూ బుధవారం అన్ని జోనల్ కార్యాలయాల వద్ధ ధర్నాలు చేపట్టాలని సిటు పిలుపునిచ్చింది. ఈ మేరకు మంగళవారం జగదాంబ జంక్షన్ సమీపాన సిటూ కార్యాలయంలో విశాఖపట్నం తోపుడుబండ్లు, చిల్లర వర్తక కార్మిక సంఘం సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సిటు జిల్లా కార్యదర్శి సింహాచలం మాట్లాడుతూ అన్ని జోన్ల పరిధిలో తోపుడు బండ్లు, బడ్డీలకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే తొలగిస్తూ వేలాది మంది చిల్లర వర్తకులను రోడ్డుపాల్జేశారన్నారు. తక్షణం తొలగించిన తోపుడుబండ్లు, బడ్డీలను అదే స్థలంలో కొనసాగించాలని, ధ్వంసం చేసిన బండ్లు, బడ్డీలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిటు జిల్లా ఉపాధ్యక్షుడు సుబ్బారావు మాట్లాడుతూ 2014 స్ట్రీట్ వెండర్స్ చట్టం ఉండగా, తోపుడుబండ్లు, బడ్డీ కార్మికులపై దాడులు చేయడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో సిటు మధురవాడ జోన్ నాయకుడు పి.రాజ్‌కుమార్, పి.వెంకట్రావు, పి.మూర్తి, వరలక్ష్మి, నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.
సిటు పిలుపు