
స్టీల్‌ప్లాంట్ మాజీ సీఎండీ బి.ఎన్.సింగ్‌కు ఘన నివాళి
ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్ పూర్వ సీఎండీ డాక్టర్ బి.ఎన్.సింగ్‌కు స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ఘనంగా నివాళి అర్పించింది. సోమవారం ఉక్కు పరిపాలన భవనంలో జరిగిన కార్యక్రమంలో బి.ఎన్.సింగ్ మృతికి ఇన్‌చార్జ్ సీఎండీ అజిత్‌కుమార్ సక్సేనా, డైరెక్టర్లు ఎ.కె.బాగ్చీ, ఎస్.సి.పాండే, జి.వి.ఎన్.ప్రసాద్, సలీం జి.పురుషోత్మన్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ డాక్టర్ కరుణ రాజు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఎన్ సింగ్ తన నాయకత్వంతో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను దేశంలోనే విలువైన ఉక్కు సంస్థగా తీర్చిదిద్దారన్నారు. రూ.4 వేలు కోట్ల నష్టంతో ఉన్న స్టీల్‌ప్లాంట్‌ను తన నాయకత్వ లక్షణాలతో 2002లో టర్న్ అరౌండ్ స్థాయికి తీసుకు వెళ్లారన్నారు. స్టీల్‌ప్లాంట్‌లో చేరకముందు ఆయన టిస్కో, సెయిల్, రూర్కెలా స్టీల్‌ప్లాంట్‌లో కీలక బాధ్యతలు నిర్వహించారన్నారు. రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన ఉక్కు పరిశ్రమలో సెలక్షన్ కమిటీ, సలహాదారుగా బాధ్యతలు నిర్వహించారన్నారు. ఆయన స్టీల్‌ప్లాంట్‌కు చేసిన సేవలను ఉద్యోగులు తమ గుండెల్లో శాశ్వతంగా నిలుపుకుంటారన్నారు.