
సమన్వయంతో ఈ–గవర్నెన్స్ సదస్సు విజయవంతం చేయాలి
మహారాణిపేట: 28వ జాతీయ ఈ–గవర్నెన్స్ సదస్సును విజయవంతం చేయడానికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ సరితా చౌహాన్, రాష్ట్ర ఐటీ సెక్రటరీ కాటమనేని భాస్కర్ సూచించారు. ఆదివారం కలెక్టరేట్‌లో కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్‌లతో కలిసి వారు సమీక్షా సమావేశం నిర్వహించారు.
సోమవారం, మంగళవారం నోవాటెల్ హోటల్‌లో జరగనున్న ఈ సదస్సు నిర్వహణపై కేంద్ర, రాష్ట్ర, జిల్లా అధికారులతో వారు చర్చించారు. సదస్సు ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని, ప్రతి పనినీ ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభంగా ఉండేందుకు ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేయాలని, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక వెబ్ లింక్ అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. అలాగే, లైజన్ అధికారులు ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్ల నుండి వచ్చే అతిథులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి ఈ ప్రతిష్టాత్మక సదస్సును విజయవంతం చేయాలని వారు కోరారు.