
విశాఖ ఉక్కు ప్రగతిలో.. డా.బీఎన్ సింగ్‌ది సువర్ణాధ్యాయం
ఉక్కునగరం: విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులకు స్ఫూర్తి ప్రదాత, ఆర్థిక నష్టాల్లో ఉన్న ప్లాంట్‌ను లాభాల బాట పట్టించిన మేధావి, మాజీ సీఎండీ డాక్టర్ బీఎన్ సింగ్ ఆదివారం లక్నోలో కన్నుమూశారు. ‘నా ఉద్యోగులే నా బలం’అని చాటి చెప్పి స్టీల్‌ప్లాంట్ పునరుజ్జీవానికి మార్గదర్శకులైన ఆయన మరణ వార్త స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులకు తీవ్ర విషాదాన్ని కలిగించింది.
రూ.4 వేల కోట్ల నష్టాల నుంచి..
1997 నవంబర్ 28న బీఎన్ సింగ్ స్టీల్‌ప్లాంట్ సీఎండీగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటికి సంస్థ రూ.4 వేల కోట్ల నష్టాలతో, సిక్ ఇండస్ట్రీగా ప్రకటించి, బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్‌స్ట్రక్షన్(బీఐఎఫ్‌ఆర్)కు రిఫర్ చేయబడింది. కంపెనీ ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయిన పరిస్థితులు. అసాధారణ మెటలర్జిస్ట్, టెక్నోక్రాట్ మాత్రమే కాకుండా కార్మికుల పట్ల మానవీయ దృక్పథం కలిగిన నాయకుడాయన. ‘టెక్నాలజీ ఒక ప్లాంట్‌ను నిర్మిస్తుంది.. కానీ దాన్ని లాభాల్లో నడిపేది మనుషులే’అని ఎప్పుడూ చెప్పేవారు. ఆనాడు సంస్థ నష్టాలకు వెరవకుండా స్టీల్‌ప్లాంట్ శ్రామిక శక్తిని సమీకరించారు. అప్పటి 16 వేల మంది సిబ్బందిని ‘వుయ్ కెన్’అంటూ ఉత్తేజపరిచారు. 2002 నాటికి లాభాల బాట పట్టించారు. తరచూ ఉత్పత్తి విభాగాలను సందర్శిస్తూ, అక్కడి ఉద్యోగులతో నేరుగా మమేకమవుతూ వారితో సన్నిహితంగా ఉండేవారు. ఉక్కునగరంలోని సీఎండీ బంగ్లాలో పండే మామిడి పండ్లను ఉద్యోగులతో పంచుకునేవారంటే.. ఆయనకు ఉద్యోగుల పట్ల ఉన్న దృక్పథం ఏంటో తెలుసుకోవచ్చు.
అందరినీ ఏకతాటిపైకి తెచ్చి..
యూనియన్లు, అధికారులు, కార్మికులు, యాజమాన్యం కలిసి కట్టుగా పనిచేసేలా సంఘటితం చేసిన వ్యక్తిగా బీఎన్ సింగ్‌ను చెప్పుకోవచ్చు. క్లిష్టమైన ఆర్థిక సవాళ్లను అధిగమించి, 2002 నాటికి సంస్థను లాభాల్లోకి తీసుకురావడం వెనుక ఆయన నాయకత్వ పటిమే కారణమని చెప్పడం అతిశయోక్తి కాదు. తీవ్రమైన ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఉద్యోగుల హక్కులు, సంక్షేమం ఆలస్యం కాకుండా చూసుకున్న నిజమైన మానవతావాదిగా ఆయన్ని ఉద్యోగులు, కార్మికులు చెప్పుకుంటారు. స్టీల్‌ప్లాంట్ కోసం ఆయన చేసిన సేవల్ని గుర్తించి, ఆయన గౌరవార్థం ఆంధ్ర విశ్వవిద్యాలయం మెటలర్జికల్ ఇంజినీరింగ్‌లో ఆయన పేరిట గోల్డ్ మెడల్‌ను అందిస్తున్నారు. ఆధ్యాత్మికవేత్త కూడా అయిన డాక్టర్ బిఎన్ సింగ్ టువార్డ్స్ ది క్రియేటర్, లైఫ్ ఏ జర్నీ, రిలిజియన్ సైన్స్ అండ్ సొసైటీ అనే వైజ్ఞానికతతో కూడిన ఆధ్యాత్మిక పుస్తకాలను రచించారు. ఆయన మృతి పట్ల స్టీల్‌ప్లాంట్ అధికార, కార్మిక సంఘాలు, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

విశాఖ ఉక్కు ప్రగతిలో.. డా.బీఎన్ సింగ్‌ది సువర్ణాధ్యాయం