ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ విభాగంకార్యదర్శి కాటమనేని భాస్కర్
మహారాణిపేట: విశాఖ నగర విశిష్టతను, ప్రాముఖ్యతను మరింత పెంచేలా ఈ నెల 22, 23వ తేదీల్లో నిర్వహించనున్న ఈ–గవర్నెన్స్ జాతీయ సదస్సును విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఐటీ, ఎలక్ట్రానిక్స్–కమ్యూనికేషన్స్ విభాగం సెక్రటరీ కాటమనేని భాస్కర్ సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో సదస్సు నిర్వహణ, ఇతర ఏర్పాట్లపై సమీక్షించి అధికారులకు పలు అంశాలపై మార్గదర్శకాలు జారీ చేశారు. కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఐటీ శాఖ మంత్రి, కేంద్ర, రాష్ట్రాల ఉన్నత స్థాయి అధికారులు సదస్సులో భాగస్వామ్యం అవుతారని, వారంతా హర్షించేలా ఏర్పాట్లు ఉండాలని తెలిపారు. ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్, నగరంలోని ప్రముఖ ప్రాంతాల్లో హోర్డింగ్లు పెట్టాలని చెప్పారు. నోవాటెల్ హోటల్ వద్ద వైద్య బృందాలు, ఆధునిక సదుపాయాలు కలిగిన అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచాలని సూచించారు. నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ట్రావెలింగ్ ప్లాన్ పక్కాగా ఉండేలా చూసుకోవాలని చెప్పారు. కార్యక్రమ నిర్వహణకు అనుగుణంగా నియమించిన కమిటీలు, ఇప్పటివరకు చేపట్టిన చర్యలను పీపీటీ ద్వారా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ విభాగం ఎండీ సూర్యతేజ, డీసీపీ కృష్ణకాంత్ పాటిల్, డీఆర్వో భవానీ శంకర్, పలువురు డిప్యూటీ కలెక్టర్లు, భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.