
వినియోగదారులతోసౌమ్యంగా మెలగాలి
ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి
సాక్షి, విశాఖపట్నం: సమస్యలు వివరించడానికి వచ్చే విద్యుత్ వినియోగదారులతో అధికారులు, సిబ్బంది సౌమ్యంగా మాట్లాడాలని, వారి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి సూచించారు. వినియోగదారుల పట్ల దురుసుగా ప్రవర్తించవద్దని స్పష్టం చేశారు. ఐఐఎం విశాఖపట్నం సహకారంతో, ఏపీఈపీడీసీఎల్ సాగర్ నగర్ శిక్షణ కేంద్రంలో ‘ఆర్గనైజేషనల్ బిహేవియర్–మేనేజింగ్ పీపుల్’అనే అంశంపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించాలనే లక్ష్యంతో పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు ఉద్యోగుల నైపుణ్యాలను పెంచుతాయని, తద్వారా సిబ్బంది వినియోగదారులకు మరింత దగ్గర అవుతారన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న చీఫ్ జనరల్ మేనేజర్లు, జనరల్ మేనేజర్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు సీఎండీ పృథ్వీతేజ్ ధ్రువపత్రాలు ప్రదానం చేశారు. సంస్థ ఫైనాన్స్–హెచ్‌ఆర్డీ డైరెక్టర్ డి.చంద్రం, ఐఐఎం ప్రోగ్రామ్ డైరెక్టర్లు ప్రొఫెసర్ హ్యాపీ పాల్, ప్రొఫెసర్ అనుపమ శర్మ పాల్గొన్నారు.