
సమస్యలు చెప్పనీయరా?
ఏయూ మహిళా హాస్టల్ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన
మద్దిలపాలెం: ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల బాలికల వసతిగృహం వద్ద శనివారం రాత్రి ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన జరిగింది. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల సావిత్రిబాయి వసతిగృహంలో సమస్యలు తెలుసుకోవడానికి వెళ్లిన భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్‌ఎఫ్‌ఐ) బాలికల విభాగం నాయకులను యాజమాన్యం లోనికి అనుమతించలేదు. అయితే, తమ సమస్యలు చెప్పడానికి విద్యార్థినులు బయటకు వస్తున్న తరుణంలో వర్సిటీ యాజమాన్యం, వార్డెన్ వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న మూడో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, నిరసనకారులకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రాత్రి వేళల్లో వసతిగృహంలోకి బయటివారిని అనుమతించబోమని యాజమాన్యం తెలిపిందని పోలీసులు సర్దిచెప్పారు. ఈ ఘటనపై ఎస్‌ఎఫ్‌ఐ బాలికల విభాగం కో–కన్వీనర్ పి.ప్రగతి మాట్లాడుతూ.. విద్యార్థినుల సమస్యల పరిష్కారానికి తాము వస్తే అడ్డుకోవడం అన్యాయమన్నారు. విద్యార్థినులను ఇలా నిర్బంధించడం దారుణమని పేర్కొన్నారు. విద్యార్థినులందరూ ఏకమై హాస్టల్ వార్డెన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదని ఆరోపించారు. విద్యార్థుల నుంచి వేల రూపాయలు ఫీజులుగా వసూలు చేస్తూ నాణ్యత లేని భోజనం పెడుతున్నారని, మంచి నీటి సమస్యతో పాటు అనేక ఇతర ఇబ్బందులు ఉన్నాయని చెబుతున్నా వర్సిటీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. విద్యార్థినుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆమె హెచ్చరించారు. ఎస్‌ఎఫ్‌ఐ వర్సిటీ కార్యదర్శి డి.వెంకటరమణ, కమిటీ సభ్యులు సంజయ్, తరుణ్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.