
జీవీఎంసీలోకి గ్రామీణ ప్రాంతాలు!
లాభనష్టాలపై అధ్యయనం
రూ.60కోట్లతో నగర సుందరీకరణ
మధురవాడలో రూ.540 కోట్లతోయూజీడీ పనులకు త్వరలో టెండర్లు
కలెక్టర్ హరేందిరప్రసాద్ వెల్లడి
మహారాణిపేట: విశాఖ కేంద్రంగా నవంబర్‌లో పెట్టుబడుదారుల సదస్సు, వచ్చే ఫిబ్రవరిలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్‌ఆర్) జరగనున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. ఇందుకోసం నగరంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని చెప్పా రు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధా న రహదారులు, ముఖ్య కూడళ్ల అభివృద్ధి, పచ్చదనం పెంపు, పార్కుల ఆధునికీకరణ, లైటింగ్ మెరుగుదల వంటి పనులపై ప్రత్యేక దృష్టి సారించామని వివరించారు. ఈ పనుల కోసం స్మార్ట్ సిటీ నిధుల నుంచి రూ.60 కోట్లు ఖర్చు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. విశాఖ నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు పలు ఆధునికీకరణ పనులు చేపడుతున్నట్లు చెప్పారు. అంతేకాకుండా, మధురవాడ ప్రాంతంలో భూగర్భ డ్రైనేజీ(యూజీడీ) వ్యవస్థ ఏర్పాటు చేయడానికి ప్రపంచ బ్యాంక్ నుంచి రూ.540 కోట్ల రుణం మంజూరైందని కలెక్టర్ తెలిపారు. త్వరలో ఈ పనులకు టెండర్లు పిలవనున్నట్లు చెప్పారు. విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టడానికి పలు సంస్థలు ముందుకు రావడంతో, సుమారు ఐదు వేల ఎకరాల భూమిని సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. విశాఖ జిల్లాలో 89 శాతం జీవీఎంసీ పరిధిలో ఉందని, కేవలం 11 శాతం మాత్రమే గ్రామీణ ప్రాంతం ఉందని కలెక్టర్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు నాలుగు లక్షల జనాభా ఉన్నందున, ఆ ప్రాంతాలను జీవీఎంసీలో విలీనం చేయడం వల్ల ఎదురయ్యే లాభనష్టాలపై అధ్యయనం చేస్తున్నామన్నారు.