
ప్రజల భద్రత, రక్షణ కోసమే ‘ఆపరేషన్ లంగ్స్’
జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్
డాబాగార్డెన్స్: ప్రజల భద్రత, రక్షణ, ఆరోగ్య పరిరక్షణకు, ఫుట్‌పాత్‌ల స్వేచ్ఛకు, విశాలమైన రోడ్ల ఉపశమనానికి, పాదచారులు, వాహనాలు లేని వారి సురక్షిత నడకకు, వాహనదారుల రాకపోకలకు రక్షణ కల్పించే ధ్యేయంగా ఆపరేషన్ లంగ్స్ 2.0 చేపడుతున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ తెలిపారు. నగరంలో ఫుట్‌పాత్‌లు, రోడ్లు, ప్రధాన జంక్షన్లలో అనధికారికంగా బడ్డీలు, తోపుడు బళ్లు, ఫుడ్ స్టాళ్ల వ్యాపారాలు కొనసాగించడం వల్ల.. ప్రజలు రోడ్ల నడుస్తూ ట్రాఫిక్‌లో చిక్కుకుంటూ ప్రమాదాలకు గురవుతున్నారని చెప్పారు. ప్రజలు హానికరమైన ఆహారం విక్రయించే ఫుడ్ స్టాళ్లలో ఆహార పదార్థాలు తింటూ క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులకు గురవుతూ అనారోగ్యం పాలవుతున్నారని పేర్కొన్నారు. అందువల్లే ఫుట్‌పాత్‌ల నిర్వహిస్తున్న బడ్డీలు, స్టాళ్లను తొలగిస్తున్నట్లు తెలిపారు. చిరువ్యాపారులకు స్ట్రీట్ వెండింగ్ నిబంధనలకు అనుగుణంగా వెండింగ్ జోన్లలో కేటాయిస్తామన్నారు. ఫుట్‌పాత్‌లు, రోడ్లు, జంక్షన్లు ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యాపారస్తులు స్వచ్ఛందంగా తమ వ్యాపారాలు తొలగించి జీవీఎంసీకి సహకరించాలని కోరారు.