
కూటమిలో కూల్చివేతల కల్లోలం
బడ్డీల తొలగింపు ప్రక్రియతో
టీడీపీ, జనసేనల మధ్య చిచ్చు
మేయర్‌పై జనసేన ఎమ్మెల్యే వంశీ ఫైర్
తనకు సమాచారం లేకుండా
ఎలా తొలగిస్తారని ఆగ్రహం
దీని వెనుక ఎంపీ భరత్ హస్తం ఉందని జనసేన నేతల ఆరోపణ
కూటమి పార్టీలకు వ్యాపార, ప్రజా, వామపక్షాల నిరసన సెగ
విశాఖ సిటీ : బడ్డీల తొలగింపు ప్రక్రియ కూటమిలో కల్లోలం రేపుతోంది. టీడీపీ, జనసేన పార్టీల మధ్య చిచ్చు రాజేస్తోంది. ఏళ్ల తరబడి చిరువ్యాపారాలు చేసుకుంటున్న వారి పొట్ట కొట్టడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే విశాఖలో కూటమి పార్టీలకు వ్యాపార, ప్రజా, వామపక్షాల సెగ తగులుతోంది. దీంతో కూటమి పార్టీల ప్రజాప్రతినిధుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. విశాఖ దక్షిణ జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ నేరుగా మేయర్ పీలా శ్రీనివాసరావునే టార్గెట్ చేశారు. తన నియోజకవర్గంలో నైట్ ఫుడ్‌కోర్ట్‌లో బడ్డీలను ఎవరికి చెప్పి తొలగించారని గట్టిగా ప్రశ్నించారు. ఇది హేయమైన చర్యగా అభివర్ణించారు. తనకు తెలియకుండా ఫుడ్‌కోర్ట్‌ను తొలగించాలని కౌన్సిల్‌లో తీర్మానం చేయడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
టూర్‌కు వెళ్లిన సమయంలో తెలివిగా..
నగరంలో ఫుట్‌పాత్‌లపై దశాబ్దాలుగా చిరువ్యాపారాలు చేసుకుంటున్న వారి బడ్డీలను, ఎల్‌ఐసీ బిల్డింగ్ వద్ద ఉన్న నైట్‌ఫుడ్ కోర్టును తొలగించాలని జీవీఎంసీ కౌన్సిల్‌లో తీర్మానం చేశారు. మేయర్, కార్పొరేటర్లు నగరంలో ఉన్న సమయంలో వీటిని తొలగిస్తే వ్యాపారుల నుంచి తీవ్ర వ్యతిరేక వస్తుందని భావించారు. ప్రస్తుతం మేయర్, కార్పొరేటర్లు అధ్యయన యాత్ర పేరుతో ఉత్తర భారతదేశం పర్యటనకు వెళ్లారు. అలాగే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు సైతం అమరావతిలో ఉన్నారు. ఇదే మంచి సమయమని భావించిన ప్రజాప్రతినిధులు నగరంలో బడ్డీలను తొలగించాలని జీవీఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వారి ఆదేశాల మేరకే అధికారులు నగరంలో చిరువ్యాపారులపై విరుచుకుపడుతున్నారు. వారి జీవనాధారం దూరం చేసి పొట్టకొడుతున్నారు. దీనిపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా, నోటీసులు ఇవ్వకుండా బడ్డీలను ధ్వంసం చేయడాన్ని ప్రజా సంఘాలు సైతం తప్పుబడుతున్నాయి. అన్ని వైపుల నుంచి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన జ్వాలలు రగులుతున్నాయి. ఇప్పుడు ఇదే అంశం కూటమి పార్టీల్లో అగ్గి రాజేస్తోంది.
భగ్గుమంటున్న జనసేన
టీడీపీ ప్రజాప్రతినిధుల ఆదేశాలతోనే ఈ బడ్డీల తొలగింపు ప్రక్రియను చేపడుతున్నారని జనసేన నేతలు బహిరంగంగానే ఆరోపణలు చేస్తుండడం దుమారం రేపుతోంది. ప్రధానంగా జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ మేయర్ పీలా శ్రీనివాసరావుపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. ఎమ్మెల్యేగా తనకు ఎటువంటి సమాచారం లేకుండా నైట్‌ఫుడ్ కోర్ట్‌ను తొలగించి కమిషనర్‌పై నెపం నెట్టడాన్ని మేయర్‌పై మండిపడ్డారు. అలాగే దీని వెనుక విశాఖ ఎంపీ శ్రీభరత్ హస్తం కూడా ఉందని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. తెరవెనుక ఆదేశాలతోనే జీవీఎంసీ అధికారులు ఇంతటి దుశ్చర్యకు తెరలేపారని బహిరంగంగానే ప్రకటనలు చేస్తుండడం గమనార్హం. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటన సమయంలో మేయర్, కార్పొరేటర్లు లేకపోవడాన్ని జనసేన నేతలు తప్పుబడుతున్నారు. ఈ నెల 17న సీఎం విశాఖకు వచ్చారు. ఒక రోజు ముందే మేయర్, కార్పొరేటర్లు విహార యాత్రకు పయనమయ్యారు. ఒక రోజు ఆగి యాత్రకు వెళితే నష్టమేంటన్న ప్రశ్నలను సంధిస్తున్నారు. ఇప్పుడిదే విశాఖ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది.
నోరు మెదపని టీడీపీ ఎమ్మెల్యేలు
నగరంలో అన్ని నియోజకవర్గాల్లో వ్యాపారుల పొట్టే కొట్టే కార్యక్రమం జరుగుతోంది. కానీ టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరూ ఇప్పటి వరకు నోరుమెదపకపోవడం విశేషం. ఒకవైపు తమ జీవనాధారం దూరం చేసి కుటుంబాలను రోడ్డు పాలు చేశారని చిరువ్యాపారులు రోడ్ల మీదకు వచ్చి నిరసనలకు దిగుతున్నారు. కానీ తెలుగుదేశం తమ్ముళ్లు దీనిపై కిక్కురుమనడం లేదు. దీంతో టీడీపీ ప్రజాప్రతినిధుల ఆదేశాలతోనే ఈ తతంగం జరుగుతోందన్న విషయం అర్థమవుతోందని జనసేన నేతలు చెబుతున్నారు.
కౌన్సిల్ తీర్మానం మేరకే ఫుడ్‌కోర్ట్ తొలగింపు
డాబాగార్డెన్స్: కౌన్సిల్ తీర్మానానికి అనుగుణంగానే పాత జైల్ రోడ్డు వద్ద ఉన్న ఫుడ్ కోర్ట్‌లో ఆక్రమణలు తొలగించడం జరుగుతుందని జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకరరావు తెలిపారు. ఫుడ్ కోర్ట్‌లో 160 దుకాణాలు అనధికారకంగా నిర్వహిస్తున్నారని.. 60 మంది వ్యాపారస్తులు శుక్రవారం రాత్రి 8 గంటలకు స్వచ్ఛందంగా దుకాణాలు తరలించారని పేర్కొన్నారు. ఈ ఫుడ్‌కోర్ట్ తొలగింపు కోసం కౌన్సిల్‌లో 2025 ఆగస్టు 22వ తేదీన తీర్మానం జరిగిందని తెలిపారు. ఫుడ్ కోర్ట్ తొలగించాలని పీజీఆర్‌ఎస్‌లో కూడా అనేక ఫిర్యాదులు వచ్చాయన్నారు.

కూటమిలో కూల్చివేతల కల్లోలం

కూటమిలో కూల్చివేతల కల్లోలం