
346 వాహనాలు యజమానులకు అప్పగింత
విశాఖ సిటీ : నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలు కేసుల్లో సీజ్ చేసిన 346 వాహనాలను యజమానులకు అప్పగించేందుకు మూడో విడత వెహికల్ రిటర్న్ మేళాను నిర్వహించినట్లు పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. శుక్రవారం పోలీస్ సమావేశ మందిరంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ పలు కేసుల్లో పట్టుకున్న వాహనాలను, చోరీకి గురైన వాటిని ఎలా తీసుకోవాలో తెలియక చాలా మంది యజమానులు వదిలేస్తున్నారని పేర్కొన్నారు. కొంత మంది కోర్టుల నుంచి రిలీజ్ చేసుకోవడం తెలియక విడిపించుకోవడం లేదన్నారు. ఈ విషయాన్ని గ్రహించి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విశాఖలో ఈ రిటర్న్ మేళాను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19న తొలి దఫాలో 152, ఏప్రిల్ 22న రెండో దఫాలో 320 వాహనాలను సంబంధిత యజమానులకు అప్పగించినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమంలో జరుగుతుందన్నారు. అనంతరం యజమానులకు సీపీ చేతుల మీదుగా వాహనాలను అందజేశారు.