
సమష్టి కృషితో విశాఖను అగ్రస్థానంలో నిలుపుదాం
మహారాణిపేట: జిల్లాను అగ్రస్థానంలో నిలపడానికి అధికారులు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ విశేషాలను శుక్రవారం జిల్లా అధికారులకు వివరించిన ఆయన, ‘స్వర్ణాంధ్ర 2047’ విజన్ డాక్యుమెంట్‌లోని పది సూత్రాల ఆధారంగా అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశించారు. ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, పట్టణాల్లో నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు. మత్స్యకారులకు ఆధునిక సాంకేతికతను అందించాలని, పర్యాటక, పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించాలని చెప్పారు. ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటు, గృహ నిర్మాణ పథకాలు, ‘ప్రసాద్’ పథకం పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్లాస్టిక్ రహిత విశాఖను నిర్మించడానికి కృషి చేయాలని, కార్యాలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నివారించాలని సూచించారు. పోర్టు, పరిశ్రమలలో పారిశుధ్య చర్యలను డ్రోన్ల సహాయంతో పరిశీలించాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు తెలిపారు. రెవెన్యూ పెంచడానికి ఆస్తుల పన్ను, నీటి పన్నుల వసూళ్లపై దృష్టి పెట్టాలని కోరారు. ‘బంగారు కుటుంబాలను’ దత్తత తీసుకునే ప్రక్రియను ప్రోత్సహించాలని కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, డీఆర్వో భవానీ శంకర్, అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ల కాన్ఫరెన్స్ వివరాలను వెల్లడించిన కలెక్టర్ హరేందిర ప్రసాద్