
వుడా కాలనీ రోడ్డు దుకాణాన్ని పొక్లెయిన్‌తో తొలగిస్తున్న సిబ్బంది
భీమిలి పరిధిలో వందకు పైగా దుకాణాల తొలగింపు
మధురవాడ/కొమ్మాది/తగరపువలస: భీమిలి నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో చిరు వ్యాపారుల దుకాణాలను, తోపుడు బళ్లను అధికారులు తొలగించడంతో వారంతా కన్నీటిపర్యంతమయ్యారు. జీవీఎంసీ జోన్.2 పరిధిలో తొలగింపు ఉద్రిక్తంగా మారింది. మధురవాడ మిథిలాపురి వుడా కాలనీ రోడ్డులో సుమారు 80 బడ్డీలు, దుకాణాలను అధికారులు తొలగించారు. కనీసం సమాచారమైనా ఇవ్వకుండా తొలగించారని ఆందోళన వ్యక్తం చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో వ్యాపారులు రోడ్డుపై బైఠాయించారు. పీఎం పాలెం పోలీసులు వచ్చి, ఆందోళనకారులతో మాట్లాడి, పరిస్థితిని చక్కబరిచారు. ఎండాడ జాతీయ రహదారి నుంచి రుషికొండ వెళ్లే డబుల్ రోడ్డు వెంబడి సుమారు 20 దుకాణాలను అధికారులు పొక్లెయిన్‌లతో తొలగించారు. రెండు రోజులైనా వ్యవధి ఇవ్వకుండా తోపుడు బళ్లు, టిఫిన్ సెంటర్లు, దుకాణాలను తొలగించడంతో వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ జోన్–1 పరిధిలోని తగరపువలస మెయిన్‌రోడ్డు, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను జెడ్సీ అయ్యప్పనాయుడు ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది తొలగించారు. చిట్టివలస ఈఎస్‌ఐ ఆస్పత్రి నుంచి అంబేడ్కర్ కూడలి వరకు తొలగింపులు జరిగాయి.
చాలా అన్యాయం
ఏళ్ల తరబడి రోడ్డుపై చిరు వ్యాపారాల ద్వారా బతుకుతున్నాం. ఏళ్ల తరబడి జీవీఎంసీకి ఆశీలు కడుతున్నాం. ట్రేడ్ లైసెన్స్ ఉంది. కనీసం ముందుగా అయినా సమాచారం ఇవ్వకుండా, అధికారులు మాపై అకస్మాత్తుగా దాడి చేయడం అన్యాయం. ఇలా చేస్తే మా కుటుంబాలు ఏమై పోవాలి?
–లక్ష్మి కుమారి, చిరు వ్యాపారి