
రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం
అల్లిపురం: రోడ్డు ప్రమాద బాధితుల సహాయార్థం నగర పోలీస్ కమిషనరేట్‌లో ప్రారంభించిన సహాయక కేంద్రం ద్వారా మూడేళ్లలో 79 కేసుల్లో బాధితులకు రూ.63.50 లక్షలు పరిహారంగా అందించినట్లు సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోనే తొలిసారిగా రోడ్డు ప్రమాద బాధితుల సహాయ కేంద్రాన్ని విశాఖలో ఏర్పాటు చేశామన్నారు. హిట్ అండ్ రన్ బాధితులకు, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం కల్పించే ఆర్థిక పరిహారం అందేంత వరకు సహాయ సహకారాలు అందించడం దీని ముఖ్య ఉద్దేశమన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్ర గాయాలైన వారికి రూ.50 వేలు మంజూరు చేస్తామన్నారు. ఈ సహాయక కేంద్రం ద్వారా ఒక్కో బాధితునికి ఒక్కో పోలీస్ కానిస్టేబుల్‌ను ఎటాచ్ చేసి, రెవెన్యూ అధికారుల వద్ద తమ దరఖాస్తు ఇచ్చినప్పటి నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరే వరకు వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు. ఈ ప్రక్రియలో మూడేళ్లలో 79 మంది బాధితులకు న్యాయం జరిగిందని, మరో 106 దరఖాస్తులు విచారణలో ఉన్నట్లు తెలిపారు. అనంతరం హిట్ అండ్ రన్ బాధితులు, బాధిత కుటుంబీకులతో ముఖాముఖి నిర్వహించారు. బాధితులెవరైనా తమ సహాయక కేంద్రాన్ని 7995095793 ఫోన్ నంబర్ ద్వారా సంప్రదిస్తే, అవసరమైన సహాయం అందిస్తామన్నారు.
మూడేళ్లలో 79 కేసుల్లో
రూ.63.50 లక్షలు చెల్లింపు